‘పోలవరం’లో రూ.782 కోట్లు ఆదా

26 Sep, 2019 03:57 IST|Sakshi

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌    

విద్యుత్‌ రంగాన్ని సంస్కరించడానికి అందరి సహకారం కావాలి

సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా రూ.782 కోట్ల ప్రజల ధనాన్ని ఆదా చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదని, ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానాలు లేవని తెలిపారు. బుధవారం సచివాలయంలో జరిగిన 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దిగజారిపోయిన వ్యవస్థలను గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నామని  స్పష్టం చేశారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్‌నైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నామని, పారదర్శక విధానాల్లో జ్యుడిషియల్‌ ప్రివ్యూ అత్యుత్తమం అన్నారు. 

రివర్స్‌ టెండరింగ్‌.. ఏపీనే ప్రథమం
ఏ రాష్ట్రం కూడా రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేయడంలేదని, తొలిసారిగా రాష్ట్రంలోనే అమల్లోకి తీసుకువచ్చామని సీఎం తెలిపారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏల) విషయంలో అదే విధంగా విప్లవాత్మక విధానాలు చేపట్టామని సీఎం వివరించారు. అధికారంలోకి రాగానే విద్యుత్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తే డిస్కంలపై రూ.20 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తేలిందని, 13 నెలలుగా చెల్లింపులు లేవని అధికారులు తెలిపారని సీఎం అన్నారు.

ఇలాంటి పరిస్థితిలో పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్టకట్టలేవని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్‌ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని, పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొందని, పరిశ్రమలకిచ్చే కరెంటుకు చార్జీలను పెంచే అవకాశం కూడా లేదని వివరించారు. విద్యుత్‌ రంగంలో పరిస్థితులను సరిద్దిడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు మీ అందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు