మాది రైతు సంక్షేమ ప్రభుత్వం

15 Aug, 2019 04:26 IST|Sakshi
ఏపీ వ్యవసాయ మిషన్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఏపీ వ్యవసాయ మిషన్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రైతన్నలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం 

నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, కల్తీ పురుగు మందులను పూర్తిగా అరికట్టాలి 

కరువు బారిన పడ్డ రైతాంగానికి సాయం అందించాలి  

సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఏపీ వ్యవసాయ మిషన్‌ ద్వితీయ సమావేశం బుధవారం తాడేప   ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం అధ్యక్షతన జరిగింది. 19 అంశాలతో కూడిన అజెండాపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ మిషన్‌ చైర్మన్‌ హోదాలో వైఎస్‌ జగన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, కల్తీ పురుగు మందులను పూర్తిగా అరిక    ట్టాలని ఆదేశించారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకం కింద రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందేలా చూడాలని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే... 

‘‘కౌలు చట్టంపై రైతులకు, కౌలు రైతులకు గ్రామ వలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలి. విత్తనాలు, పురుగు మందులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే రైతులకు సరఫరా చేయాలి. ప్రతి నియోజకవర్గంలో అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలి. ఎరువులు, పురుగు మందులను పరీక్షించాలి. నాణ్యమైన వాటినే రైతులకు అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు మాత్రమే వాటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలి. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌కు ఉత్తమ శిక్షణ ఇవ్వాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆక్వా సీడ్‌ సరఫరా అనేది అగ్రి మిషన్‌ లక్ష్యాల్లో ఒకటి కావాలి. ఇది సక్రమంగా అమలు చేస్తే రైతుల సమస్యలను చాలావరకు పరిష్కరించినట్లే. 

చిరుధాన్యాల సాగును ప్రోత్సహించండి 
కరువు పీడిత ప్రాంతాల్లో చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాలి. సాగు చేసిన చిరుధాన్యాలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చూడాలి. కరువు బారిన పడ్డ రైతాంగానికి ఏ విధంగా ప్రభుత్వ సాయం అందించవచ్చన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలి. గిట్టుబాటు కాని పంటలకు ధరల స్థిరీకరణ నిధి నుంచి సాయం అందించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతులకు నష్టం జరుగుతుందంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆదుకునేందుకు సన్నద్ధం కావాలి. ప్రభుత్వం మీకు అండగా ఉందనే భరోసాను రైతన్నల్లో కల్పించాలి. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీ డబ్బులు ఇవ్వాలి. అన్ని రిజర్వాయర్లను నీటితో నింపాలి’’ అని జగన్‌ ఆదేశించారు. 

రబీకి 4.31లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం 
రైతు భరోసా సహా వివిధ కార్యక్రమాల అమలుపై పలువురు అధికారులు తమ ప్రణాళికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రబీ కోసం రూ.128.57 కోట్లు ఖర్చు చేసి, 4.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది కౌలు రైతులకు మేలు చేసేలా చట్టాన్ని తీసుకొచ్చినందుకు అగ్రి మిషన్‌ సభ్యులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కోనసీమలో ఈనెల 16వ తేదీ నుంచి 5 కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నాఫెడ్‌ ముందుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వివరించారు. వ్యవసాయ మిషన్‌ ద్వితీయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు