మా నీళ్ల‌ను మేం తీసుకుంటాం: సీఎం జ‌గ‌న్‌

12 May, 2020 20:17 IST|Sakshi

కృష్ణా బోర్డు నిర్దేశాల ప్రకారమే నీటి వాడ‌కం

తెలంగాణ‌కు శ్రీశైలం నుంచి 200 టీఎంసీల నీటిని తీసుకునే సామర్థ్యం

అన‌వ‌స‌ర రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌ని సీఎం జ‌గ‌న్ సూచ‌న‌

సాక్షి, అమరావతి: 'మనకు కేటాయించిన నీటిని తీసుకోవడానికి మ‌నం ప్రాజెక్టు కట్టుకుంటున్నామ‌'ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. దీన్ని రాజ‌కీయం చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న తన నివాసంలో ఇరిగేష‌న్ అధికారుతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా కృష్ణా జ‌లాల అంశంపై ఆయ‌న స్పందించారు. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి దాపురించింద‌న్నారు. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల‌న్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం కూడా లేద‌ని తేల్చి చెప్పారు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశాకే నీటి కేటాయింపులు చేస్తుంద‌ని తెలిపారు. ఆ కేటాయింపుల‌ పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించద‌న్నారు.

సంవత్సరంలో ప‌ది రోజులే..
"మన హక్కుగా మనకు కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్థాయిలో నీటిమట్టం సంవత్సరంలో సగటున 10 రోజులకు మించి ఉండడం మహా కష్టం. ఆ పది రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది. అదే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. ఇక 841 అడుగులకు చేరితే వేయి క్యూసెక్కులు మాత్రమే నీరు వెళ్తుంది. కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్‌ నుంచి వెళ్లేది గరిష్టంగా 9వేల క్యూసెక్కుల నీరు మాత్రమే. అది కూడా శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే ఆ మాత్రం నీళ్లైనా వెళ్తాయి" అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ వైపు ఉన్న ప్రాజెక్టుల‌ పరిస్థితిని సీఎం జ‌గ‌న్ వివ‌రించారు.

తెలంగాణ ప్రాజెక్టుల విష‌యానికొస్తే..
తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్టులు చూస్తే.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో కూడా రోజుకు 2 టీఎంసీల మేర ( 23,148 క్యూసెక్కుల నీరు) నీటిని తరలించవచ్చు. ఇలా 90 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
ఇక కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నీటిని రోజుకు 0.3 టీఎంసీల (3,500 క్యూసెక్కుల) నీటిని తీసుకెళ్లగలరు. ఇలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
ఇదే 800 అడుగుల స్థాయిలో దిండి నుంచి రోజుకు 0.5 టీంఎసీలను (5,787 క్యూసెక్కులు) తెలంగాణ తీసుకెళ్లగలదు. ఇలా 30 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. 
ఎస్‌ఎల్‌బీసీ ద్వారా అయితే శ్రీశైలంలో 824 అడుగులు నీటిమట్టం ఉన్నప్పుడు కూడా రోజుకు సుమారు 0.51 టీఎంసీ నీళ్లని (6,000 క్యూసెక్కులు) తెలంగాణ తరలించగలదు. అలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
పైన చెప్పిన‌ ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి సుమారు 200 టీఎంసీల నీటిని తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉందని సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు. దీనికి తోడు జూరాల, భీమ, నెట్టెంపాడు, కోయల్‌సాగర్‌ల నుంచి కూడా శ్రీశైలంలోకి నీళ్ళు రాకముందే తెలంగాణ నీళ్లు తీసుకోగలుగుతుందన్నారు. (న్యాయ పోరాటం చేస్తాం: సీఎం కేసీఆర్‌)

మాన‌వ‌త్వంతో ఆలోచించాలి:  సీఎం జ‌గ‌న్‌
శ్రీశైలంలో ఒకవైపు 800 అడుగులు, ఇతర తక్కువ నీటిమట్టాల స్థాయినుంచి నీటిని ఇన్ని ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఒక సదుపాయం మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏపీకి పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజస‌మ‌ని ప్ర‌శ్నించారు.
డబ్ల్యూడీటీ ప్రకారమే ఎవరు ఎన్నినీళ్లు వాడుకోవాలన్నది నిర్ణయించి, కృష్ణా రివర్‌ వాటర్‌ బోర్డు ఆ పంపకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందన్నారు. అలాంటప్పుడు ఎవరైనా దీన్ని రాజకీయం చేయడం క‌రెక్టు కాద‌ని హిత‌వు ప‌లికారు.
ఎవరైనా మానవత్వంతో ఆలోచించాలని కోరారు. వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు ఆరోజు మానవత్వంతో ఆలోచించడం వల్లే... తెలంగాణ ప్రాంతంలో ఇదే శ్రీశైలం నుంచి పాలమూరు–రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధత కాని, కల్వకుర్తి, ఎల్‌ఎస్‌బీసీ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా గాని తక్కువ నీటిమట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోగలుగుతున్నార‌ని పేర్కొన్నారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌ ఆ స్థాయిలో నీటిని ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు ప్రారంభించార‌న్నారు. 
800 అడుగుల నుంచి తెలంగాణ నీటిని తీసుకోగా లేనిది మన కేటాయింపుల ప్రకారం మనం నీటిని తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. మా నీళ్లను మేం తీసుకుంటామని తేల్చి చెప్పారు.

>
మరిన్ని వార్తలు