సకాలంలో రైతులకు చెల్లింపులు

4 Mar, 2020 03:50 IST|Sakshi
హార్టికల్చర్, సెరికల్చర్, రైతు భరోసా కేంద్రాలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాసే దుస్థితి వద్దు

హార్టికల్చర్, సెరికల్చర్, రైతు భరోసా కేంద్రాలపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 

బకాయిలు చెల్లిస్తామని తెలిసే చంద్రబాబు ప్రెస్‌మీట్‌

మనకు రావాల్సిన బకాయిలపై బాబు నోరు విప్పరేం?

ఆ విషయాన్ని ఆ మీడియా రాయదు.. ఈ చంద్రబాబూ చెప్పడు 

ధరల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఫుడ్‌ పార్క్‌

కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల గురించి ఆ మీడియా కథనాల్లో రాయరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే అందులో రూ.6 వేల కోట్లు చెల్లించింది. ఇక మిగిలింది కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే. కేంద్రం నుంచి దాదాపు రూ.4,500 కోట్ల బకాయిలు రాకున్నా రూ.2 వేల కోట్లు అప్పు చేసి మరీ రైతులకు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 

ఇవాళో, రేపో రైతుల బకాయిలు ఎలాగూ క్లియర్‌ అవుతాయి కాబట్టి.. దానికి ముందే చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు పెండింగ్‌ ఉన్నాయని చెబుతాడు. దానిని ఆయన మీడియా తల కెత్తుకుంటుంది. వాస్తవాలు ఏమిటన్నది మాత్రం ఆయనా చెప్పడు. వాళ్లూ రాయరు. గతంలో చంద్రబాబు పెండింగ్‌లో పెట్టిన రూ.960 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చాకే చెల్లించిందన్న విషయం కూడా ఆ కథనాల్లో రాయరు.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడకుండా చూడాలని, సకాలంలో చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌లో రాబోయే సమస్యలను ముందుగానే ఊహించి జాగ్రత్తలు తీసుకోవాలని, రైతుకు ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడంలో శ్రద్ధాసక్తులు చూపించాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన హార్టికల్చర్, సెరికల్చర్, రైతు భరోసా కేంద్రాలపై అధికారులతో సమీక్షించారు. ధాన్యం బకాయిలపై కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఈ సందర్భంగా కొందరు అధికారులు  ప్రస్తావించారు. ఈ దుష్ప్రచారం కొత్తేమీ కాదని, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.4,500 కోట్ల గురించి చంద్రబాబు మాట్లాడరని, ఆయన నోటి నుంచి ఈ మాట కూడా రాదని ఎద్దేవా చేశారు. నిజాయితీ, పారదర్శకత, బాధ్యతతో రైతులకు న్యాయం చేసే దిశగా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..

రైతులకు మేలు జరిగేలా శాశ్వత పరిష్కారం
అరటి, చీని, టమాటా, మామిడి, ఉల్లి, కొబ్బరి మార్కెటింగ్‌కు సంబంధించి ప్రతి ఏడాది ఏదో రూపంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరలు దక్కక రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి పంటల విషయంలో రైతులకు మేలు జరిగేలా శాశ్వత పరిష్కారం చూడాలి. ఈ పంటల ఆధారంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి. అవి వచ్చేలోగా కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఏటా ఒక పంటను లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్‌ ఇబ్బందులు రాకుండా కార్యాచరణను అమలు చేయండి. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, అనుబంధ ఉత్పత్తులపై దృష్టి సారించాలి. ఆహార శుద్ధి పరిశ్రమలు, యూనిట్లు పెట్టి రైతులను ఆదుకోవాలి. అరటి, చీని, టమాటా, కొబ్బరి, ఉల్లి, మామిడి పంటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ప్రాసెసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తుల కోసం శాశ్వత సర్టిఫికేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి.

అరటి అనుబంధ ఉత్పత్తులపై ఐజీ కార్ల్‌లో ఓ సంస్థ
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు దిశగా అడుగు వేయాలి. పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యవసాయం, దాని అనుబంధ సంస్థల్లో అరటి అనుబంధ ఉత్పత్తులపై ఓ సంస్థను ఏర్పాటు చేయాలి. అరటి అనుబంధ ఉత్పత్తులపై పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టాలి. సోలార్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ రూం సహా ఏది చేసినా సంతృప్త స్థాయిలో చేయండి. మండలాన్నో, నియోజకవర్గాన్నో యూనిట్‌గా చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపడితే సత్ఫలితాలు వస్తాయి. కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్ని తెల్లదోమ ఆశించినట్టు తెలుస్తోంది. దీని నివారణకు ఏయే చర్యలు చేపట్టాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించుకున్న 50 వేల టన్నుల పండ్ల ఉత్పత్తుల ఎగుమతిని పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలి. స్వయం సహాయక సంఘాలతో తేనె ఉత్పత్తులను ప్రోత్సహించి గిరిజనులకు న్యాయం చేయండి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

రైతు భరోసా కేంద్రాలు ఆదర్శంగా నిలవాలి
రాష్ట్రంలో 3,300 రైతు భరోసా కేంద్రాలు సిద్ధమయ్యాయని చెప్పినప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ అధికారుల పని తీరును ప్రశంసిస్తూ ఈ కేంద్రాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాక వ్యవసాయం సహా ఉద్యానవన పంటల సాగులో వినూత్న మార్పులు తీసుకురావాలన్నారు. ఏయే వంగడాలు సాగు చేయాలన్న దానిపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించాలని, వచ్చే ఖరీఫ్‌ నాటికి అన్ని కేంద్రాలు సిద్ధం కావాలని చెప్పారు. ‘వ్యవసాయ సిబ్బందికి ఇచ్చే ట్యాబ్‌లతో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా చూడాలి. ఇ–క్రాపింగ్‌ను పూర్తి చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపై దృష్టి సారించాలి. ప్రతి గ్రామ సచివాలయంలో మద్దతు ధరల పోస్టర్‌ ఉండాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే విత్తనాలు నాణ్యంగా ఉండాలి. ఖరీఫ్‌కు విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలి. 

మరిన్ని వార్తలు