హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

16 Jun, 2017 17:05 IST|Sakshi
హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. గండికోట ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రిని నిర్లక్ష్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ శుక్రవారం వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెలో ఆత్మహత్య చేసుకున్న హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గండికోట ప్రాజెక్ట్‌ పూర్తయి ఉంటే హర్షవర్థన్‌ రెడ్డి ఆత్మహత్య జరిగి ఉండేది కాదన్నారు. రైతులకు 2014 నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇన్సురెన్స్‌ బకాయిలు కూడా అలాగే ఉన్నాయన్నారు. ఇప్పుడు ఇన్సురెన్స్‌ ఉంటే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వొద్దని చంద్రబాబు ఆదేశించారని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరలోనే వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రైతుల కష్టాలు తీరుతాయని వైఎస్‌ జగన్‌ అన్నారు. కాగా అప్పుల బాధతో హర్షవర్థన్‌ రెడ్డి ఈ నెల 4వ తేదీని పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.

వైఎస్‌ఆర్‌ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్న వైఎస్‌ జగన్‌ను  అంతకు ముందు చేనేత రంగ కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో తమ గోడు వెల్లబోసుకున్నారు. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... చేనేత రంగంపై జీఎస్టీతో ఆ రంగం మరింత కుదేలయ్యే ప్రమాదముందని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా...జీఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. ఇదే విషయమై తక్షణమే లేఖ రాయబోతున్నామని తెలిపారు. చేనేత రంగం సంక్షేమం దృష్ట్యా...... కనీసం దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడం దారుణమన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌లో మంత్రి యనమల రామకృష్ణుడు మెంబర్‌గా ఉండి కూడా.... వారి సమస్యలను ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.

మరిన్ని వార్తలు