ఉద్యోగులకు మే నెల వేతనాలు పూర్తిగా చెల్లింపు

22 May, 2020 05:14 IST|Sakshi

ఆర్థిక శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల వేతనాలను పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కొంత శాతం జీతాలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మే నెలకు సంబంధించిన జీతాలపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించి పూర్తి వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.

పూర్తి జీతాలు చెల్లిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు
లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల నుంచి పూర్తి జీతభత్యాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగుల పక్షాన ఏపీఎన్‌జీవో నేతలు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాస్‌ గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 50 శాతం జీతాలు చెల్లించడంతో ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన మానవతా దృక్పథంతో స్పందించి మే నెల నుంచి పూర్తి జీతభత్యాలు ఇవ్వడానికి అంగీకరించారని చెప్పారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మిగిలిన 50 శాతం జీతాన్ని త్వరలో చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని సీఎంను వారు కోరారు.

మరిన్ని వార్తలు