మహానేతకు ఘన నివాళులు

9 Jul, 2019 02:49 IST|Sakshi
సోమవారం ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, షర్మిల, అనిల్‌కుమార్, ఇతర కుటుంబ సభ్యులు

ప్రత్యేక ప్రార్థనలలో  సీఎం వైఎస్‌ జగన్, కుటుంబ సభ్యులు 

సీఎం హోదాలో తొలిసారిగా ఇడుపులపాయకు రాక

ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు  

పులివెందుల : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలను ఇడుపులపాయలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం ఉదయం కడప నుంచి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకున్నారు. వీరికి  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌  పూలబొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు ఘన స్వాగతం లభించింది. అనంతరం వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు.

వారితో పాటు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలమ్మ, బ్రదర్‌ అనిల్‌కుమార్, వైఎస్‌ జగన్‌ కుమార్తెలు హర్ష, వర్ష, షర్మిల కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌ సోదరులు రవీంద్రనాథరెడ్డి, సుధీకర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, పులివెందుల వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి, చక్రాయపేట మండల నాయకులు వైఎస్‌ కొండారెడ్డి, లింగాల, సింహాద్రిపురం మండలాల ఇన్‌చార్జి ఎన్‌.శివప్రకాష్‌రెడ్డి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ గూడూరు రవి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, ఎస్టేట్‌ మేనేజర్‌ భాస్కర్‌రాజు తదితరులు పాస్టర్లు బెనహర్‌ బాబు, నరేంద్రకుమార్, మృత్యుంజయ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిలమ్మ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఇడుపులపాయలోని ఎస్టేట్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. అక్కడికి వచ్చిన బంధువులందరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్డు మార్గాన గండి క్షేత్రానికి వెళ్లారు. 

 

మరిన్ని వార్తలు