ఇది దగాకోరు ప్రభుత్వం

13 Nov, 2017 06:00 IST|Sakshi

బాబు మాయ మాటలతో మోసం చేస్తున్నారు

దువ్వూరు బహిరంగ సభలో ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 

ప్రొద్దుటూరు నుంచి దువ్వూరు వరకు సాగిన ప్రజాసంకల్ప పాదయాత్ర

సమస్యల పరిష్కారం కోసం వెల్లువెత్తిన వినతులు

సాక్షి కడప : ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఆరో రోజైన ఆదివారం పాదయాత్ర ప్రొద్దుటూరు, దువ్వూరు మండలాల్లో సాగింది. దువ్వూరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కరువు రైతును ఆదుకోవడంలో కూడా నిర్లక్ష్యం సాగుతోందని, ఇప్పటి వరకు కరువు మండలాల ప్రకటన చేయకపోవడం దారుణమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  కేసీ కెనాల్‌ స్థిరీకరణ జరగాలంటే కచ్చితంగా రాజోలి ప్రాజెక్టును నిర్మించి తీరాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రొద్దుటూరులోని అమృతానగర్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడిన ప్రతిపక్ష నేత అమృతానగర్‌లో  నాన్న హయాంలో వేలాది ఇళ్లు నిర్మిస్తే నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదని ధ్వజమె త్తారు. ఏడాది కాలం ఆగండి... అధికారంలోకి రాగానే అమృతానగర్‌ రూపురేఖలు మారుస్తామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం చేనేత కార్మికుల సమస్యలపై ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వం వారి పట్ల చూపుతున్న సవతి ప్రేమను ఎండగట్టారు. 

ఎంత కష్టాన్ని భరిస్తున్నావు బిడ్డా...
దువ్వూరు మండలం నేలటూరు మెట్ట వద్ద చాపాడు మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన పలువురు మహిళలు వచ్చి ప్రతి పక్ష నేతను కలిశారు. లక్షుమ్మ అనే మహిళ వైఎస్‌ జగన్‌ను చూసి ఎంత కష్టాన్ని భరిస్తున్నావు బిడ్డా... మా కష్టాలను పంచుకునేందు కు నువ్వు ఇబ్బందులు పడుతున్నావు... మా రాజశేఖరరెడ్డి కొడుకును చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని కన్నీరు పెట్టుకుంది.   

అన్ని వర్గాల నుంచి వినతులు
ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డులో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు వారి సమస్యలను వైఎస్‌ జగన్‌తో ఏకరువు పెట్టారు.  కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకొచ్చారు. సగర (ఉప్పర) సామాజిక వర్గానికి చెందిన వారు, బేడ బుడగజంగాల సామాజిక వర్గ ప్రజలు కలిసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్న వైనాన్ని వైఎస్‌ జగన్‌కు వివరించారు. సీపీఎస్‌ యూనియన్, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు కూడా వినతి పత్రాలు ఇచ్చారు.  

మరిన్ని వార్తలు