మోసం చేయడంలో డిగ్రీ చేశారు

17 Aug, 2017 01:44 IST|Sakshi
- చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌ 
ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని వర్గాల వారినీ మోసం చేశారు   
మీరు న్యాయానికి ఓటు వేసి.. శిల్పామోహన్‌రెడ్డిని ఆశీర్వదించండి 


 
 
నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను వంచనకు గురి చేశాడు.. ప్రత్యేక డిక్లరేషన్, సబ్‌ప్లాన్‌ పేరుతో ముస్లిం మైనార్టీలను వంచించాడు.. రిజర్వేషన్లంటూ కాపులనూ నమ్మించి ముంచేశాడు.. పేద ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తానని చెప్పి, ఒక్క ఇల్లూ కట్టిన పాపాన పోలేదు.. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే.. ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి వాడుకోవడం.. ఆ తర్వాత అందరినీ పక్కకు తోసేయడం ఆయన నైజం.. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు డిగ్రీ చేశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.

మూడున్నరేళ్ల పరిపాలనలో ఒక్క మంచి పని చేయని చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించండని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎనిమిదవ రోజు బుధవారం రోడ్‌షో పట్టణంలోని హరిజనపేట నుంచి ప్రారంభమై మాల్దారిపేట, స్వాలిహీన మసీదు, నడినగడ్డ, నబీనగర్, కోటవీధి, నడిగడ్డ, జగజ్జననీనగర్, ఆత్మకూరు బస్టాండు మీదుగా పార్కురోడ్డు వరకు సాగింది. ఈ సందర్భంగా హరిజనపేట, చింత అరుగు సెంటర్, నడిగడ్డ, ఆత్మకూరు బస్టాండు సెంటర్లలో జగన్‌ ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. 
 
డబ్బు మూటలతో వస్తాడు.. 
లంచాల రూపంలో సంపాదించిన డబ్బు మూటలతో చంద్రబాబు మీ ఇంటికి వస్తాడు. మీ చేతిలో రూ.5 వేలు పెట్టి.. ఆ తర్వాత జేబులో నుంచి దేవుడి పటం తీసి చేతిలో పెట్టి.. దేవుడి మీద ప్రమాణం చేయించుకుని మరీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఏ దేవుడు కూడా పాపానికి ఓటు వేయమని చెప్పలేదు. పాపానికి ఓటెయ్యండి అని చెప్పేది దెయ్యాలు మాత్రమే. కాబట్టి రేపు మీ ఇంటికొచ్చే దెయ్యాలతో గొడవ పడకుండా లౌక్యంగా వ్యవహరించండి. మనస్సులో దేవుణ్ణి తలచుకొని.. ధర్మంవైపే మేముంటామ ని అనుకోండి. ఆ తర్వాత ధర్మానికే మీరు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించండి. బాబు మాదిరిగా నా దగ్గర డబ్బుల్లేవు. నా దగ్గర సీఎం పదవి లేదు. పోలీసుల బలం నా దగ్గర లేదు. చంద్ర బాబు మాదిరిగా లేనిది ఉన్నట్టుగా... ఉన్నది లేనట్టుగా చూపించే టీవీ చానళ్లు నా దగ్గర లేవు. ప్రియతమ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోతూ ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబం నాకున్న ఆస్తి.

నాన్నగారు చేసిన ఆ సంక్షేమ పథకాలు ఇంకా మీ గుండెల్లో బతికే ఉండటం నాకున్న ఆస్తి. జగన్‌ మోసం చేయడు. జగన్‌ మాట ఇస్తే తప్పడు. జగన్‌ ఏదైనా చెబితే చేస్తాడు.. అన్న విశ్వసనీ యత నాకున్న ఆస్తి. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం  నాకున్న ఆస్తి. నవరత్నాలతో జగన్‌ కూడా ప్రతీ పేదవాడి ఇంట్లో వెలుగులు నింపుతాడు.. వాళ్ల నాన్న మాదిరిగానే పేదల కోసం తపిస్తాడు అన్న ప్రజల్లో ఉన్న నమ్మకమే నాకున్న ఆస్తి. నాకున్న ఆస్తి దేవుడి దయ. మీ ఆశీస్సులే’’ అని జగన్‌ పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు