ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి 

26 May, 2019 04:17 IST|Sakshi

నేడు ప్రధానిని కోరనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది 

కేంద్ర సర్కారు చేయూతనివ్వాలి.. వీలైనంత ఎక్కువ సాయం అందించాలి 

కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి 

ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి  

విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలి 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వీలైనంత ఎక్కువ సాయం ఉదారంగా అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన (డిజిగ్నేటెడ్‌ సీఎం) వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఢిల్లీలో ప్రధానికి వినతిపత్రం అందజేస్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను సాధించడంతో పాటు కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను రాబట్టడమే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆదివారం ఢిల్లీకి వెళుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పటిష్టమైన కార్యాచరణతో జగన్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ను కోరారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జగన్‌కు మోదీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 

‘విభజన’ హామీలు అమలు చేయాలి
రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీకి జగన్‌మోహన్‌రెడ్డి తెలియజేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విభజన సమస్యలు, హామీలపై జగన్‌ ఇప్పటికే ఉన్నతాధికారులతో కలిసి అధ్యయనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంలో ఇంకా రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా, దాని ఆవశ్యకత గురించి మోదీకి వివరిస్తారు. గత ఐదేళ్లుగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేస్తారు.

పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, దుగ్గరాజపట్నం పోర్టు, వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు తదితర విభజన హామీలను అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రం అన్ని విధాలా కష్టాల్లో కూరుకుపోయిందని, అభివృద్ది చెందాలంటే విభజన చట్టంలోని హామీలను నేరవేర్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు, చేయూత అవసరమని విన్నవిస్తారు. గతంలో పరిపాలన లోపభూయిష్టంగా జరిగిందని,   దానిని గాడిలో పెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తన భుజాలపై ఉందని ప్రధానికి వివరించనున్నారు. 

రూ.30 వేల కోట్లు వెంటనే అవసరం 
ప్రజలు ఆశలు, ఆకాంక్షలను తీర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించడం లేదని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రం మీ తోడ్పాటును, ఆర్థిక సాయాన్ని అర్థిస్తోందని ప్రధానికి జగన్‌ విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్రానికి మేలు జరిగేలా కేంద్రం ఆర్థికంగాను, ఇతరత్రా పూర్తి సహకారం అందించాలని కోరనున్నారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను మనసులో పెట్టుకోకుండా ఏపీకి సంపూర్ణ సహకారం అందించాలని విన్నవించనున్నారు. ఇప్పటికే రూ.30 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మరో రూ.30 వేల కోట్లు వెంటనే అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఉదారంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా ప్రధానమంత్రికి విజ్ఞాపన అందజేస్తారు.  

>
మరిన్ని వార్తలు