నెరవేరనున్న పేదింటి కల!

10 Jul, 2019 06:53 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ప్రతి మనిషికి కూడు..గూడు..గుడ్డ కనీస అవసరాలు. వాటిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ గత పాలకులు తమ స్వార్ధప్రయోజనాలకే పెద్దపీట వేసి పేదల అవసరాలను కనీసం పట్టించుకోలేదు. ఇళ్లకోసం ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఇంటిస్థలమైనా ఇవ్వమని వేడుకున్నా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సొంతిల్లులేని నిరుపేదలు ఉండకూడదన్న లక్ష్యంతో వేస్తున్న అడుగులు వారికి ఊరటకలిగిస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో చాలా మంది అర్హులకు సొంత ఇల్లు సమకూరలేదు. కొందరికి ఇళ్లు మంజూరైనా వాటి నిర్మాణం పూర్తి కాలేదు. చాలా ఇళ్లకు రుణ మొత్తాలు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఉగాది నాడు అర్హులైనవారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని కోసం జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయనే వివరాలను సేకరించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే అత్యధిక స్థలాలు గత ప్రభుత్వ  హయాంలో టీడీపీ నేతల భూదాహానికి ఖాళీ అయ్యాయి.

జిల్లాలో 6వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నా యి. వీటిలో చాలా వరకూ నివాసయోగ్యంగా లేవు. కొండలు, గుట్టలతో నిండి ఉన్నాయి. వీటి ని ఇళ్ల నిర్మాణానికి తగిన విధంగా తయారుచేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు భూములైనా కొనుగోలు చేసి పేదలకు పంచిపెట్టాలని సీఎం జగన్‌ స్పష్టం చేయడంతో ఆ దిశగా కూడా చర్యలు మొదలవుతున్నాయి.స్థలాలు కొనాలన్నా... ఖర్చుతో కూడుకున్నపనే. ఉన్న స్థలాలను అనుకూలంగా మా ర్చుకోవాలా... లేక ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేయాలా... అన్న చర్చలు అధికార వర్గాల్లో జరుగుతున్నాయి.

ఇప్పటికిప్పుడు పేదలకు పంచి పెట్టడానికి జిల్లాలో అందుబాటులో ఉన్న ది కేవలం 130 ఎకరాలు మాత్రమే. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా ఇల్లు లేని ప్రతిపేదవాడికీ 1.5సెంట్ల భూమి ఇవ్వాలంటే ఈ 130 ఎకరాలను 8,666 మందికి పంచవచ్చు.జిల్లాలో 7.13లక్షల మంది తెల్లరేషన్‌ కార్డు కలిగినవారున్నారు. వీరంతా పేద ప్రజలు. 2006 నుంచి 2019 వరకూ మంజూరైన ఇళ్లు దాదాపు 3.63లక్షలు. మిగిలిన 3.5లక్షల మందిలో సొంతిళ్లు ఎందరికి ఉందనేది తేలాల్సి ఉంది. అదీగాక గత ప్రభుత్వాల్లో ఇళ్లు మంజూరవ్వడమేగానీ మంజూరైనవన్నీ నిర్మాణం పూర్తిచేసుకోలేదు. టీడీపీ హయాంలో 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇల్లయినా మంజూరు కాలేదు.

తర్వాత మూడేళ్ల కాలంలో జిల్లాకు వివిధ స్కీంల ద్వారా 99,297 ఇళ్లు మంజూరు కాగా అందులో 74,876 ఇళ్లకు పరిపాలన అనుమతులు వచ్చాయి. వాటిలో పైకప్పు వరకూ(ఆర్‌సి) కంప్లీట్‌ అయినవి 30,324 ఇళ్లు, పూర్తిగా నిర్మాణం జరిగినవి 43,188 ఇళ్లు మాత్రమే. ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తే తప్ప ఎందరికి ఇళ్లు అవసరమనే వాస్తవ సంఖ్య తేలదు. ఈ నేపథ్యంలో అధికారులు ఒక వైపు గృహæ, స్థల లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు