పోల‘వరం’లో తొలి అడుగు

20 May, 2020 08:42 IST|Sakshi

రూ.79 కోట్ల ప్యాకేజీకి గ్రీన్‌ సిగ్నల్‌

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌

చురుగ్గా పునరావాస కాలనీలు 8 జూన్‌ నాటికి ముంపు గ్రామాల తరలింపు 

నిర్వాసితులను పెడచెవిన పెట్టిన చంద్రబాబు 8 నేడు, రేపు మంత్రి అనిల్‌కుమార్‌ పర్యటన

సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లావాసుల కలల సౌధం పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే రోజులు వచ్చేశాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు నిర్వాసితులకు స్వర్ణ యుగం వచ్చేసింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్యాకేజీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే నిర్వాసితులకు పునరవాస ప్యాకేజీ  రూ.79 కోట్లు కేటాయించారు. నిర్వాసితులు సంతోషంగా ఉంటేనే  ప్రాజెక్టు నిర్మాణం ముందుకు వెళుతుందనే ఉద్దేశంతో సీఎం తొలి విడత ప్యాకేజీ ప్రకటించి ... ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఏటా కడలిపాలవుతున్న వేల టీఎంసీలను ఒడిసిపట్టే బహుళార్థక సాధక ప్రాజెక్టును సాకారం చేయాలనే చిత్తశుద్ధి ఉండడడంతో సీఎం ముందుగా తమ గోడు పట్టించుకుంటున్నారని నిర్వాసితులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి జలవనరులశాఖా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బుధ, గురువారాల్లో జిల్లా పర్యటనకు వస్తున్నారు. (అన్ని వర్గాల ఆర్థిక ప్రగతికి..సంక్షేమ రథం)

కమీషన్ల కోసం బాబు యావ
గత పాలకుల నిర్లక్ష్యానికి సాక్షీభూతంగా నిర్వాసితులు మిగిలిపోయారు. వారి బాధలను గాలికొదిలేసి కమీషన్లు వచ్చే పనులను భుజానకెత్తుకున్నారు. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని మొత్తుకున్నా పట్టించుకోలేదు. పునరావాస చర్యలు తీసుకున్న తరువాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్వాసితులు, నిపుణులు కమిటీ సూచించినా చంద్రబాబు అండ్‌ కో పెడచెవిన పెట్టారు. ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఐదేళ్లు మొత్తుకున్నా కనీసం పట్టించుకోకుండా బాబు సర్కార్‌ అనాలోచితంగా పర్సంటేజీలకు కక్కుర్తిపడి కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టి గ్రామాలను ముంచేశారు. (కోవిడ్‌ పట్ల భయాందోళనలు పోవాలి)

కాఫర్‌ డ్యామ్‌తో కొద్దిపాటి వరదకే గతేడాది మూడుసార్లు గిరిజన గ్రామాలు ముంపునకు గురై నిర్వాసితులు మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలంలో గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తేనే దేవీపట్నంతోపాటు విలీన మండలాల్లో ముంపునకు గురవుతాయి. అటువంటిది కాఫర్‌ డ్యామ్‌ కారణంగా భద్రాచలంలో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేసే సరికే ఏజెన్సీ మండలాలు ముంపునకు గురయ్యే పరిస్థితి. ఇంతా చేసి అధికారం కోల్పోయాక తగదునమ్మా అంటూ చంద్రబాబు తనయుడు, లోకేష్‌ ముంపు గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు బాధితుల ఆగ్రహానికి తోకముడిచి వెనుతిరగక తప్పింది కాదు. 

వైఎస్‌ హయాంలో...  
మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పుడు ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముందు ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. హామీ ఇచ్చినట్టే ముంపు బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేవారు. నాడు దేవీపట్నం మండలం వీరవరంలంక, గొందూరు, పరగసానిపాడు, అంగుళూరు, బోడిగూడెం గ్రామాల ప్రజలను ఇందుకూరిపేట–ఫజుల్లాబాద్‌కు మధ్య నిర్మించిన కాలనీలకు తరలించారు. భూమికి, భూమి, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, కాలనీలు నిర్మాణం పూర్తి చేశారు. ఈ రకంగా వైఎస్‌ హయాం 2004–2009 మధ్య సుమారు 1500 నిర్వాపిత కుటుంబాలకు మంచి చేశారు.

ఆ బాటలోనే తనయుడు 
గతేడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వేలో వీక్షించారు. అనంతరం మంత్రులు, అ«ధికారులతో సమీక్షించిన సందర్భంలో నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్‌ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. అనాలోచితంగా చంద్రబాబు సర్కార్‌ నిర్మించిన కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, ఇళ్లకు నష్టపరిహారం కోసం ఇటీవలనే రూ.79 కోట్లు విడుదల చేశారు. మహానేత వైఎస్‌ తరువాత ఇంత కాలానికి మళ్లీ ప్యాకేజీని ప్రకటించి మనసున్న నాయకుడిగా సీఎం నిలిచారని నిర్వాసితులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కాఫర్‌ డ్యామ్‌కు సమీపాన ఉన్న ఆరు గ్రామాలకు పూర్తి స్ధాయి ప్యాకేజీ, ఇళ్ల నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేయడంతో ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లడానికి మార్గం సుగమమైందని చెప్పొచ్చు.  

శరవేగంగా కాలనీలు... 
ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తొలివిడతలో దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన కాలనీల నిర్మాణం జరుగుతున్నాయి. గిరిజనేతరులకు గోకవరం మండలం కృష్ణునిపాలెంలోను, గిరిజనులకు దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణం చురుగ్గా జరుగుతున్నాయి. వాస్తవానికి గత చంద్రబాబు సర్కార్‌లోనే వీరికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ ఐదేళ్ల పాలనలో ఏనాడూ నిర్వాసితులను పట్టించుకున్న దాఖలాలు లేవు.  

వైఎస్‌ ఆలోచనే వేరు
మాజీ ముఖ్యమంత్రి వెఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన రాగానే ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టేవారు. 

కమీషన్లకే బాబు ప్రాధాన్యం 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కమీషన్ల కోసమే పోలవరం పనులు చేపట్టేవారు. ఇందుకు ఉదాహరణ కాఫర్‌ డ్యాం నిర్మాణం. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని బాధితులు మొత్తుకున్నా అప్పటి సర్కారు పట్టించుకోలేదు. దీని ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి.  ఈ పాపం ఆయనదే.

జగన్‌దీ తండ్రిబాటే...
గత ఏడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వేలో వీక్షించారు. పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్‌ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేసి మాట నిలబెట్టుకుంటున్నారు.

‘బాబు సర్కార్‌ పట్టించుకోలేదు’ 
నిర్వాసితులకు ముందుగా పునరావాసం కల్పించాలనే ఆలోచనే చంద్రబాబు సర్కార్‌కు రాలేదు. గ్రామాల నుంచి తరలించేందుకు అంత ప్యాకేజీ ప్రకటించడాన్ని ఎప్పుడూ పట్టించు కోలేదు. కాఫర్‌ డ్యామ్‌కు దగ్గరగా ఉన్న గ్రామాల్లో మాకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం కాళ్లరిగేలా తిరిగాం. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులను అసలు మనుషులుగా కూడా చూడ లేదు. కమీషన్ల కోసం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చూసుకున్నారు తప్ప వరదలు వస్తే నిర్వాసితులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని పట్టించుకోలేదు. 
– పోలిశెట్టి శివరామకృష్ణనాయుడు, తొయ్యేరు 

‘ప్యాకేజీ సంతోషంగా ఉంది’ 
ఈ ఏడాది వరదలు వచ్చినా నిర్వాసితులు ఎవరు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఏర్పాట్లు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. గత వరదలు వలన నిర్వాసితులు అష్ట కష్టాలు పడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేమంతా బలయ్యాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులను తరలించే ఏర్పాటు చేయడం ఊరటనిస్తోంది. కాలనీలకు తరలించి వరద ముంపు నుంచి తప్పిస్తారని ఎదురుచూస్తున్నాం. – వెంకటరమణ, సీతారామం 

మరిన్ని వార్తలు