కొత్త వెలుగు

12 Nov, 2019 11:48 IST|Sakshi
నగరంలో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటాన్ని ఊరేగిస్తున్న వెలుగు వీవోఏలు

వీవోఏల వేతనం రూ.10 వేలకు పెంపు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఇందులో రూ.2వేలుఎస్‌హెచ్‌జీల నుంచి..రూ.8 వేలు ప్రభుత్వం నుంచి చెల్లింపు

జిల్లాలో 3007 మందికి లబ్ధి

సంబరాలు చేసుకున్న వీవోఏలు

సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

మహిళా సాధికరతకు మేమే బాటలు వేశామని ఇంతకాలం డబ్బా కొట్టుకున్న నాటి టీడీపీ పాలకులు.. వాస్తవానికి క్షేత్రస్థాయిలో మహిళా స్వయంశక్తి సంఘాలకు అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉంటున్న వెలుగు వీవోఏలకు చేసిందేమీ లేదు. ఇన్నాళ్లూ వారు రూ.2వేల గౌరవ వేతనంతోనే కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. సంఘాల లావాదేవీల ఖాతాలు, సమావేశాల నిర్వహణ వంటి కీలక బాధ్యతలతో బిజీగా ఉండే వీవోఏలు ఏమాత్రం సరిపోని గౌరవ వేతనాన్ని పెంచాలని ఎంత మొత్తుకున్నా గత పాలకులకు పట్టలేదు. ఈ తరుణంలో ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారిపై కరుణ చూపింది. వారి కృషిని గుర్తించి.. జీవితాల్లో కొత్త వెలుగు నింపే నిర్ణయం తీసుకుంది. వారికిస్తున్న గౌరవవేతనాన్ని ఏకంగా రూ.8 వేలు పెంచి రూ.10వేలు చేసింది. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన మరో హామీని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విధంగా అమల్లోకి తెచ్చారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో 3007 మంది వీవోఏలకు లబ్ధి చేకూరనుంది. దీనిపై ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడంతో వెలుగు ఉద్యోగులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు.

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మైదాన ప్రాంతం 28 మండలాల్లో 1,453 మంది, ఏజెన్సీ 11 మండలాల్లో 583 మంది వీవోఏలు, విశాఖ నగరపాలక సంస్థతో పాటు నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల పరిధి లో 1,071 మంది యానిమేటర్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు. మొత్తం 3,007 మందికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శుభవార్త అందించారు. ఎస్‌హెచ్‌జీలో తాము అందిస్తున్న సేవలకుగాను ఇప్పటివరకూ అందుతున్న రూ.2 వేలకు తోడు మరో రూ.8 వేలను ప్రభుత్వం తరఫున చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్‌టీ నంబరు 2544తో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

క్షేత్రస్థాయిలో కీలక బాధ్యతలు...
స్వయం సహాయక సంఘాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా సమన్వయం చేయడంలో వీవోఏల పాత్ర గురుతరమైంది. సంఘంలోని సభ్యుల్లో బాగా క్రియాశీలకంగా ఉన్న ఒకరిని ఎంపిక చేసి ఈ బాధ్యతలు అప్పగిస్తారు. సంఘం సమావేశాలను నెలలో ఒకటీ రెండు సార్లు తప్పకుండా నిర్వహించడం, సంఘం ఖర్చు, జమా ఖాతా నమోదుచేయడం, రుణాల మంజూరు విషయంలో ఇటు గ్రూపునకు అటు బ్యాంకు మధ్య సంధానకర్తగా వ్యవహరించడం, గ్రూపు ఖాతాను పర్యవేక్షించడం వంటి బాధ్యతలన్నీ వీవోఏ చూడాల్సిందే. ఇంత కష్టం ఉన్నా గత టీడీపీ ప్రభుత్వం మాత్రం వారిని సభలకు జనసమీకరణ చేసేవారిగానే చూస్తూ వచ్చింది. ఎక్కడ బహిరంగ సభ నిర్వహించినా సభ్యులను బతిమిలాడి వాహనం ఎక్కించకపోతే పైనుంచి వేధింపులు తప్పేవికావు. ఇంతచేసినా వేతనం మాత్రం రూ.2 వేలు మాత్రమే. తమ వేతనాలు పెంచాలని వీవోఏలు ఎంత మొత్తుకున్నా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు ఎన్నికలకు ముందు రూ.5 వేల చొప్పున ఇస్తానని చెప్పినా సంఘం లాభాలతో ముడిపెట్టారు. అంటే ఏ సంఘమైతే లాభాల్లో ఉందో ఆ వీవోఏ మాత్రమే ఆ మొత్తాన్ని తీసుకోవడానికి అర్హులనడంతో దీనివల్ల చాలామందికి ప్రయోజనం లేకపోయింది.

పాదయాత్రలో మాటిచ్చారు..
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తాము పడిన కష్టాలను వీవోఏలు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. దీనికి ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినవెంటనే వేతనం రూ.10 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. అలా ఇచ్చిన మాటను నెరవేర్చారు. వేతనం పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రకారం గతంలో మాదిరిగానే రూ.2 వేలు సంఘం తరఫున, మిగతా రూ.8 వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ వేతనంగా అందుతాయి.   సోమవారం ఈ వార్త తెలిసిన వెంటనే వీవోఏల ఇంట సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ప్రజాప్రతినిధులను కలిశారు. వారితో తమ ఆనందం పంచుకున్నారు. వారితో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు.

మరిన్ని వార్తలు