వైఎస్‌ఆర్‌కు కుటుంబసభ్యుల ఘన నివాళి

8 Jul, 2017 08:09 IST|Sakshi

ఇడుపులపాయ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి వేడుకలు శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానేత జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద  కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.  వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనీల్, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

మహానేత జయంతి సందర్భంగా తండ్రితో ఉన్న జ్ఞాపకాలను వైఎస్ జగన్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘నేనేప్పడు ప్రజలను కలుసుకున్నా వారందిరిలోనూ నాన్నగారినే చూస్తున్నాను. వారి ఆదరాభిమానాలు, ఆప్యాయతల్లో నిత్యం ఆయనే కనిపిస్తున్నారు. ప్రజలు చూపిన మార్గంలో నేను నాన్న లాగానే నడుస్తాను. ఆయన కుమారుడిగా గర్వపడుతున్నాను.’ అని ఆయన ట్విట్‌ చేశారు.

అనంతరం వైఎస్‌ఆర్‌ ఘాట్‌ ప్రాంగణంలోని మహానేత విగ్రహానికి వైఎస్‌ జగన్‌ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమానికి మహానేత కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు మహానేత 68వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)