నెరవేరిన వైద్య‘కల’శాల..

5 Oct, 2019 10:45 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందిస్తున్న పారిశుధ్య కార్మికులు

శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్‌ జగన్

రూ.266 కోట్లతో ప్రారంభం కానున్న నిర్మాణం

పారిశుధ్య, ట్రామాకేర్‌ సిబ్బందికి వరాలు 

సాక్షి, ఏలూరు: జిల్లా కేంద్రం ఏలూరులోని కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని కృషితో జిల్లాకే తలమానికంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణాలకు మార్గం సుగమమైంది. ఏలూరు పర్యటనలో భాగంగా స్థానిక సీఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ఉదయం 10.25 గంటలకు దిగిన సీఎం వైఎస్‌ జగన్‌ అక్కడ నుంచి నేరుగా జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఉదయం 10.40 గంటలకు చేరుకున్నారు. వైద్య కళాశాల భవనాల నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ట్రామాకేర్‌ సెంటర్‌లో పనిచేస్తోన్న సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సమస్యలను సావధానంగా విన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అనంతరం 10.55 గంటలకు సీఎం ప్రభుత్వాసుపత్రి నుంచి స్థానిక ఇండోర్‌స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బయలుదేరివెళ్లారు.

వైద్య కళాశాల నిర్మాణం ఇలా.. 
జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో 100 మంది విద్యార్థులకు తొలి ఏడాది ప్రవేశాలు కల్పిస్తూ ప్రతిపాదించిన వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.266కోట్లు నిధులు ఇప్పటికే మంజూరు చేసింది. ఆసుపత్రిలోని 12.22 ఎకరాల్లో కళాశాల భవనాల నిర్మాణాలు చేపడతారు. మెడికల్‌ కౌన్సిల్‌ ప్రమాణాలకు అనుగుణంగా 5 లెక్చర్‌ హాల్స్, పరిపాలనా విబాగం, సెంట్రల్‌ లైబ్రరీ, సెంట్రల్‌ వర్క్‌షాప్, 13 వైద్య విభాగాల బ్లాక్‌లతోపాటు, బాలురు, బాలికలకు హాస్టల్, స్టాఫ్‌ క్వార్టర్లు, కిచెన్, కాంటీన్‌ తదితర సదుపాయాలు ఇందులో చేపడతారు. ఈ నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, రఘురామకృష్ణంరాజు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, కలెక్టర్‌ ముత్యాలరాజు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శంకరరావు, మెడికల్‌ కౌన్సిల్‌ బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ వరప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ట్రామాకేర్‌ సిబ్బందికి న్యాయం చేస్తా 
ఏలూరు ప్రభుత్వాసుపత్రి ట్రామాకేర్‌ యూనిట్‌లో పనిచేస్తోన్న సిబ్బంది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ బాధలు చెప్పుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ ప్రతి నెలా వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటానని, ట్రామాకేర్‌ సిబ్బంది క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. దీనిపై ట్రామాకేర్‌ సిబ్బంది ఎం.రమేష్, బి.రవి, కిశోర్, సుధారాణి తదితరులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి పారిశుధ్య కార్మికులకు వరాల జల్లు ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి పారిశుధ్య కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గత 20 సంవత్సరాలుగా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నామని, దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన తమకు రూ.11,500 ఇవ్వాలంటూ జీవో ఇచ్చినా వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం తమను ఎవరూ పట్టించుకోలేదని గోడు చెప్పుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌ మున్సిపల్‌ కార్మికులతో సమానంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తోన్న పారిశుధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. ఇక ఔట్‌ సోర్సింగ్‌ విధానంపై పరిశీలించి అందరికీ న్యాయం చేస్తానంటూ సీఎం వైఎస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు.

వెంటనే స్పందించారు 
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. ఔట్‌సోర్సింగ్‌ విధానం కావటంతో చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. గత చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా గోడు చెప్పుకోగానే ఆయన వెంటనే మాకు జీతాలు పెంచుతానని భరోసా ఇచ్చారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానం కూడా తీసేస్తానని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌కు మా జీవితాంతం రుణపడిఉంటాం. 
– లక్ష్మణమూర్తి, ఎస్‌కే కరీమా, పారిశుధ్య కార్మికులు, ఏలూరు  

మరిన్ని వార్తలు