చెరువులో వల వేసి, లాగిన వైఎస్ జగన్‌

25 May, 2018 12:07 IST|Sakshi
రొయ్యల చెరువులో వల లాగుతున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, ఉంగుటూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోంది. జననేతకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాసంకల్పయాత్ర 171వరోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్.. పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించారు. రొయ్యల చెరువులో చేపలు, రొయ్యలకు మేత వేసిన స్వయంగా జననేత వైఎస్‌ జగన్.. వల వేయడంతో చేపలు, రొయ్యలు పట్టడం ఎలాగో వారిని అడిగి తెలుసుకున్నారు. రొయ్యలు, చేపల ధరలు ఎందుకు పడిపోతున్నాయో రైతులు ప్రతిపక్షనేతకు వివరించారు.

తమను దళారులు ఏ విధంగా దోచుకుంటున్నది ఆక్వా రైతులు వైఎస్‌ జగన్‌కు వివరించారు. వ్యాపారులు సిండికేట్ అయ్యి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ఈ సిండికేట్‌లో ప్రధాన భాగస్వామి అధికార పార్టీకి చెందిన నేత చింతమనేని ప్రభాకర్ అని వైఎస్‌ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. జననేత వారికి ధైర్యం చెప్పి, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని.. రైతులు గిట్టుబాటు ధర వచ్చేవరకు తమ పంటను కోల్డ్ స్టోరేజ్ లో దాచుకోవచ్చని చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

రైతు రుణ మాఫీ జరగలేదని పెదకాపవరం వద్ద కటారి కనక దుర్గ అనే మహిళ వైఎస్‌ జగన్‌ను కలుసుకుని.. తమ బాధ వివరించారు. లక్ష రూపాయల పంట రుణం తీసుకుని ప్రతి ఏటా వడ్డీ చెలిస్తన్నామని జగన్‌కి ఆ కుటుంబం వివరించింది. వైఎస్సార్‌ ప్రభుత్వంలో రుణ మాఫీ అయ్యిందని.. ఈ ప్రభుత్వంలో అసలు మాఫీ ఊసేలేదని వాపోయారు.

మరిన్ని వార్తలు