పెన్నా కేసులో కోర్టుకు హాజరైన జగన్

12 Nov, 2013 01:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెన్నా సిమెంట్స్ పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, పెన్నా సంస్థల చైర్మన్ పి.ప్రతాప్‌రెడ్డిలు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. న్యాయమూర్తి నిర్దేశించిన మేరకు వ్యక్తిగత పూచీకత్తుతోపాటు రూ.25వేల చొప్పున వీరి తరఫున ఇద్దరు పూచీకత్తు బాండ్లను సమర్పించారు.
 
  నిందితుల జాబితాలో ఉన్న పీఆర్ ఎనర్జీస్, పెన్నా సిమెంట్స్, పయనీర్ హోల్డింగ్స్ సంస్థల తరఫున ప్రతాప్‌రెడ్డి పూచీకత్తు బాండ్లు సమర్పించారు. వాటిని ఆమోదించిన న్యాయమూర్తి ఎంవీ రమేష్.. తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. ఇందూ సంస్థ పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఈనెల 13న జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు