కుప్పం నుంచే మన గెలుపు మొదలవ్వాలి

5 Jan, 2018 02:41 IST|Sakshi

ప్రతి కార్యకర్త సవ్యసాచిగా మారి  చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి

పాదయాత్ర ప్రాంతానికి తరలి వచ్చిన కుప్పం ప్రజలకు జగన్‌ పిలుపు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ప్రారంభం కావాలని, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కె.చంద్రమౌళిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంటానని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలంతా సవ్యసాచులై చంద్రబాబు చేస్తున్న మోసాలు, సాగిస్తున్న రాక్షస పాలన గురించి ప్రజల్లో ప్రచారం చేయాలని కోరారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 52వ రోజు గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు శాసనసభా నియోజకవర్గంలోని పాలమంద పెద్దూరు వద్ద పాదయాత్ర సాగిస్తున్న జగన్‌ను కుప్పం నుంచి వేలాదిగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కలుసుకున్నారు. 170 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి తనపై అభిమానంతో తరలి వచ్చిన వారినుద్దేశించి ఆయన ఉత్తేజంగా ప్రసంగించారు. జగన్‌ ఏం మాట్లాడారంటే..

బీసీలంతా ఏకం కావాలి
‘‘రిటైర్డు ఐఏఎస్‌ అధికారి అయిన చంద్రమౌళిని కుప్పం ప్రజలకు తోడుగా ఉండేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గత ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయించాం. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా చంద్రమౌళి అప్పటి నుంచి ఇప్పటి దాకా కుప్పం నియోజకవర్గాన్ని, అక్కడి ప్రజలను ఏనాడూ వదలి పెట్టలేదు. ఆయనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీకు ఎల్లవేళలా తోడుగా ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు అన్యాయమైన పాలనను మీరంతా చూశారు.

ప్రతి కార్యకర్త ఒక అర్జునుడిగా.. సవ్యసాచిగా మారి, ఊరూరా చంద్రబాబు హయాంలో జరుగుతున్న మోసాలను గురించి చెప్పాలి.  అమాయకులైన బీసీలను సులువుగా మోసం చేయొచ్చని చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని కాదని బీసీలు ఎక్కువగా ఉన్న కుప్పం ఎంచుకున్నారు. గెలిచిన తర్వాత ఆయన బీసీలకు చేసిందేమీ లేదు. అందుకే బీసీ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన చంద్రమౌళి అన్నను మన పార్టీ గత ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా మీ ముందుకు తెచ్చింది. ఈ నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క హామీ నెరవేర్చలేదు.

ఈ తరుణంలో బీసీలంతా ఒక్కటి కావాలి.  రేపు చంద్రబాబు మీ వద్దకు వచ్చి నాకు బీసీలపై ప్రేమ ఉందనే మాట చెబితే.. బీసీలకు మీరేం చేశారు చంద్రబాబూ.. అని గట్టిగా అడగండి.  చంద్రబాబు అధికారంలోకి రాక ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బీసీలుగా ఉన్న మేమంతా కూడా చదువులకు ఏనాడూ ఇబ్బందులు పడలేదని చెప్పండి. మా పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్‌ ఇంకా పెద్ద చదువులు చదివేందుకు ఖర్చుకు వెనకాడకుండా వైఎస్‌ మాకు అండగా నిలిచారని, మరి బీసీలపై ప్రేమ ఉందంటున్న నువ్వేం చేశావు అని బాబును గట్టిగా అడగండి.

దేవుడి దయవల్ల, మీ ఆశీస్సులతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను ఇది వరకే ప్రకటించిన నవరత్నాలను అమలు చేస్తాం. ఈ నవరత్నాల కార్యక్రమం వల్ల అందరి కన్నా ఎక్కువగా బాగు పడేది బీసీలేనని చెబుతున్నా. ఆ నవరత్నాలతో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటి సువర్ణ యుగాన్ని తెచ్చుకుందాం. అందులో భాగంగా మీరంతా సవ్యసాచులు కావాలి. మన గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే మొదలు కావాలని మీ అందరినీ కోరుతున్నా.   


బస్సు యాత్రతో కుప్పంకు వస్తా...
ఇవాళ ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఇన్ని వేల మందిలో అందరినీ కలుసుకునే పరిస్థితి ఉండదు. దయ ఉంచి నన్ను మరోలా భావించవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరినీ కలిసినట్లుగానే భావించండి. ప్రతి ఒక్కరూ నా గుండెల్లోనే ఉంటారని మీ అందరికీ చెబుతున్నా. చంద్రమౌళి అన్నను గెలిపించండి. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుని నా పక్కన కూర్చోబెట్టుకుంటాను.

కుప్పంకు చంద్రబాబు చేసిన దానికన్నా ఎక్కువగా చేస్తానని హామీ ఇస్తున్నా. ఎంతో దూరం నుంచి తరలి వచ్చి మీరంతా నాపై చూపిన ఆదరాభిమానాలకు పేరు పేరునా కృతజ్ఞతలు. నా పాదయాత్ర ఇపుడు కుప్పం దాకా రాక పోవచ్చు. పాదయాత్ర ముగిశాక, ఆగస్టులోనో.. సెప్టెంబర్‌లోనో బస్సు యాత్ర మొదలవుతుంది. నేను ఏఏ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయలేక పోయానో వాటన్నింటిలో బస్సు యాత్ర చేస్తాను. అపుడు కుప్పంకు వచ్చి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ తిరుగుతా’’నని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు