చరిత్రాత్మకం ప్రజా సంకల్పం 

6 Nov, 2019 05:07 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్లు 

కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు విన్న అరుదైన నేత 

జగన్‌ అనే నేను ఉన్నానంటూ భరోసా 

ఇచ్చిన మాట మేరకు సీఎం కాగానే వడివడిగా నవరత్నాల అమలు  

కసితో సంక్షేమ పథకాల అమలులో తలమునకలు 

సాక్షి, అమరావతి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు నేటి (బుధవారం)తో సరిగ్గా రెండేళ్లు నిండాయి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు రావాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. పాదయాత్ర పొడవునా జన నేతను కలుసుకోని వర్గం లేదు. అన్ని జిల్లాల్లో జనం తండోపతండాలుగా తరలి వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మరోవైపు పూలబాట వేసి స్వాగతం పలికారు. మద్యం మహమ్మారికి బలవుతున్న కుటుంబాల నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాథలు, అర్హతలున్నా ఉద్యోగం, ఉపాధి లేని యువతీ యువకులు, విద్యార్థులు పాదయాత్రలో భాగస్వాములై బాధలు చెప్పుకున్నారు. 

జగన్‌ అనే నేను.. 
పాదయాత్రలో ప్రజలకు ‘జగన్‌ అనే నేను..’ అంటూ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే ఆయన్ను ‘జగన్‌ అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను’ అని చెప్పే వరకు నడిపించాయి. ఈ ఏడాది మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ జగన్‌ తొలి సంతకం చేశారు. మంత్రివర్గ కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం కలిగించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనివిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులను ఇచ్చి చరిత్రను తిరగరాశారు. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ‘మాట తప్పను, మడమ తిప్పను’ అనే మాటలను అక్షరాలా నిజం చేస్తూ కొత్త అసెంబ్లీ ఏర్పడిన తర్వాత తొలి సమావేశాల్లోనే 19 చట్టాలు చేసి భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలి రోజే ప్రకటించిన జగన్‌ అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పద వులు, నామినేటెడ్‌ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. 

అదొక మహా యజ్ఞం  
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఒక మహాయజ్ఞం. ఆయన సంకల్ప బలమే ఆయన్ను 3,648 కిలోమీటర్లు నడిపించింది. ప్రపంచంలోనే చిరస్థాయిగా నిలిచి పోయిన యాత్ర ఆద్యంతం జగన్‌లో ఏ మాత్రం అలసట అనేది కనిపించలేదు.   మధ్యలో హత్యాయత్నం జరిగినా ఆయన ఏమాత్రం జంకలేదు.    
– తలశిల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌     

మరిన్ని వార్తలు