అడ్డంకులు దాటి.. అన్నను చూడాలని..

1 Jul, 2018 07:41 IST|Sakshi

ముమ్మిడివరం సభకు పోటెత్తిన ప్రజలు 

 చిత్తైన ప్రత్యర్థుల ఎత్తులు 

 ప్రజా సంకల్పయాత్రకు నీరా‘జనాలు’ 

 వైఎస్‌ జగన్‌ ప్రసంగానికి జేజేలు 

 ముమ్మిడివరంలోకి ప్రవేశించిన పాదయాత్ర 

 201వ రోజు 10.5 కిలోమీటర్లు సాగిన యాత్ర  

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రత్యర్థుల ఆశలు అడియాసలయ్యాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు చిత్తయ్యాయి. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం ముమ్మిడివరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. వైఎస్‌ జగన్‌ ప్రసంగానికి జేజేలు పలికారు. ప్రత్యర్థుల ఊహకందని విధంగా ప్రజా ‘సంకల్పం’ ఉవ్వెత్తున ఎగసిపడడంతో అవాక్కవ్వడం వారి వంతైంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర శనివారం అమలాపురం నియోజకవర్గం నుంచి ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

 మొదటి రోజు ముమ్మిడివరంలో జరిగిన బహిరంగ సభకు ప్రజలు తరలివెళ్లకుండా ప్రత్యర్థులు, అధికార పార్టీ నేతలు అనేక పన్నాగాలు పన్నారు. ఎలాగైనా సభను విఫలం చేయాలన్న లక్ష్యంతో ఉపాధి కూలీలకు పని ఇవ్వబోమని, సభకు వెళితే పింఛన్‌ కట్‌ చేస్తామని, ఇకపై ఏ ప్రభుత్వ పథకం ఇవ్వబోమని.. ఇలా పలు విధాలుగా బెదిరింపుల పర్వానికి తెరతీశారు. మరికొందరు సభకు వీలైనంత మంది వెళ్లకుండా చేసే ఉద్దేశంతో నగదు, మద్యం పంపిణీ చేశారు. ప్రజల అభిమానం ముందు ఇవన్నీ పటాపంచలయ్యాయి. 

వైఎస్‌ జగన్‌ ప్రసంగానికి నీరాజనం... 
ముమ్మిడివరం పట్టణం హైస్కూల్‌ సెంటర్‌లో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహిని వైఎస్‌ జగన్‌ ప్రసంగానికి నీరాజనాలు పలికింది. సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ ప్రసంగం స్థానిక సమస్యలను స్పృశిస్తూ, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, ఎన్నికల హామీల అమలు చేయడంలో మోసాన్ని వివరిస్తూ సాగింది. గంటా పది నిమిషాల పాటు ఏకథాటిగా సాగిన వైఎస్‌ జగన్‌ ప్రసంగం సభికులను ఉత్తేజితులను చేసింది. మధ్య మధ్యలో జగన్‌ వేసిన ప్రశ్నలకు ప్రజలు చేతులెత్తి తమ మద్దతును, సమాధానాన్ని తెలిపారు. తీవ్రమైన ఉక్కపోతలో కూడా సభలో ఉన్న ప్రతి ఒక్కరూ జగన్‌ ప్రసంగం ముగించే వరకు నించుని విన్నారు. 

స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి.. 
వైఎస్‌ జగన్‌ తన ప్రసంగంలో స్థానిక సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జీవనది గోదావరి పక్కనే పారుతున్నా ముమ్మిడివరంలో తాగునీటికి దిక్కులేకుండా పోయిందంటూ ప్రజలు చెప్పిన విషయాన్ని సభలో ప్రస్తావించారు. కలుషిత నీటిని బాటిల్‌లో చూపుతూ రూ.2కే 20 లీటర్ల మంచినీరు ఇస్తామని ఎన్నికల్లో çహామీ ఇచ్చి, ప్రమాణస్వీకారం రోజున చేసిన ఐదు సంతకాల్లో ఇదీ ఉందని చెబుతూ ప్రభు త్వ వైఫల్యాన్ని ఎండగట్టడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వరదల సమయంలో లంకల్లో నష్ట నివారణకు ఏటి గట్టు, గ్రోయిన్స్‌ నిర్మాణంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. 

జూన్‌లో సాగునీరు విడుదల చేయాలని రైతులు మొత్తుకుంటున్నా జూలై వస్తున్నా నేటికీ నియోజకవర్గంలో పంట పొలాలకు సాగునీరందని విషయాన్ని ప్రస్తావిస్తూ తుఫాన్లపై రైతుల ఆందోళనను ప్రస్ఫుటం చేశారు. ప్రస్తుత పాలకులు ఇచ్చిన హామీ మేరకు కోనసీమలో కొబ్బరి పరిశ్రమ ఎక్కడైనా కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. జి.మూలపొలం–గొల్లగరువు బిడ్జ్రిని 2009లో వైఎస్‌ హయాం లో శంకుస్థాపన చేసి 30 శాతం పనులు పూర్తి చేసినా ఆ తర్వాత ఆ పనులను గాలికొదిలేసిన పరిస్థితి ప్రభు త్వ తాత్సారాన్ని తేటతెల్లం చేస్తోందని మండిపడ్డారు. గుత్తెనదీవి–గోగుల్లంక వంతెన ప్రతిపాదనలూ పక్కనపెట్టేశారని, లంక గ్రామాలకు బయట ప్రపంచంతో అనుసంధానానికి ఎంతో అవసరమైన రెండు వంతెలనపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తూర్పారబట్టారు. 

పాదయాత్ర సాగిందిలా...
ప్రజా సంకల్పపాదయాత్ర 201వ రోజు అమలాపురం నియోజకవర్గం నుంచి ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి నుంచి శనివారం ఉదయం 8:40 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర కొద్దిసేపటికి సింగరాయపాలెం దాటి అనాతవరం గ్రామం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గంలోని ప్రవేశించింది. మహిపాలచెరువు దాటిన తర్వాత శ్రీనివాస ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలో భోజన విరామం తర్వాత ప్రారంభమైన పాదయాత్ర బొండాయికోడు, కొండాలమ్మచింత మీదుగా ముమ్మిడివరంలోని బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంది. మార్గంమధ్యలో అక్కచెల్లెమ్మలు వైఎస్‌ జగన్‌కు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువత, పిల్లలు తమ అభిమాన నేతతో సెల్ఫీలు దిగారు. కష్టాలు, సమస్యలు చెప్పుకున్న వారికి భరోసా కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు. బహిరంగ సభ అనంతరం ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో రాత్రి బస ప్రాంతానికి చేరుకున్న జగన్‌ను పలువురు పార్టీ నేతలు కలిశారు. 201వ రోజున 10.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

పాదయాత్రలో జననేతతో పార్టీ నేతలు.. 
పాదయాత్ర, బహిరంగ సభలో ఉభయగోదావరి జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవిని త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి, అమలాపురం, కాకినాడ పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కరసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పినిపే విశ్వరూప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురామ్, కొయ్యే మోషేన్‌రాజు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్‌కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, తోట సుబ్బారావునాయుడు, వేగుళ్ల లీలాకృష్ణ, కొండేటి చిట్టిబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు, పాముల రాజేశ్వరి, జిల్లా పరిషత్‌ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర కార్యదర్శలు భూపతిరాజు సుదర్శనబాబు, పెయ్యల చిట్టిబాబు, పెనుమత్స చిట్టిరాజు, మిండగుదిటి మోహన్, కర్రి పాపారాయడు, జిల్లా రైతు విభాగం అ«ధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, బీసీ విభాగం అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, అమలాపురం పార్లమెంట్‌ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కసిరెడ్డి అంజిబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు కాశి మునికుమారి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల పార్టీ కన్వీనర్లు జగతా పద్మనాభం, నల్లా నరసింహమూర్తి, పిన్నమరాజు వెంకటపతిరాజు, కాదా గోవిందకుమార్, పార్టీ నేతలు కాలే రాజబాబు, బళ్ల వెర్రబ్బాయి, భూపతిరాజు బుల్లిరాజు, ఢిల్లీ నారాయణ, రాయపురెడ్డి జానకిరామయ్య, దున్నా జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు