ఉప్పొంగిన జన కెరటం..

2 Dec, 2018 06:36 IST|Sakshi

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో అవస్థలు పడుతున్న ప్రజల కష్టాలను తీర్చేందుకు వస్తున్న జగన్నాథ రథచక్రాలు..ఉప్పొంగిన జనసంద్రం నడుమ  పాలకొండ నియోజకవర్గంలో పాదయాత్రను ముగించుకుని శనివారం మధ్యాహ్నం రాజాం నియోజకవర్గంలోకి అడుగుపెట్టాయి. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తోన్న ప్రజాసంకల్పయాత్ర శనివారంతో 309  రోజులు పూర్తి చేసుకుంది. ఉదయం పాలకొండ మండలం అన్నవరం కూడలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. గోపాలపురం, మంగళాపురం క్రాస్‌ల మీదుగా సాగుతూ..మధ్యాహ్నం రాజాం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది.

 రేగిడి ఆమదాలవలస మండలం బొడ్డవలస క్రాస్, సంకిలి బ్రిడ్జి వద్దకు పాదయాత్ర చేరుకోగానే భారీ సంఖ్యలో సమీప గ్రామ ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం సాగిన పాదయాత్ర సంకిలి నుంచి ప్రారంభించి, చిన్నయ్యపేట, పుర్లిపేట కూడలి, మజ్జిరాముడి పేట మీదుగా ఉంగరాడ మెట్ట గ్రామానికి చేరింది. ఇదిలావుంటే పాదయాత్రలో వేలాది మంది మహిళలు జగన్‌ను కలుసుకుని తమ మద్దతును ప్రకటించారు. పలువురు మహిళలు జగనన్నతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.

 పలువురు ప్రభుత్వ వైఖరితో ఎదురవుతున్న సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలన్నీ ఓపిగ్గా వింటూ అందరి యోగక్షేమాలను జగన్‌ తెలుసుకున్నారు. మరికొద్ది నెలల్లో మనందరి ప్రభుత్వంగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు.   నాగావళి నదిపై కరకట్టలు నిర్మాణం చేపట్టాలని అన్నవరానికి చెందిన రైతులు విన్నవించారు. సంకిలిలో పలువురు ఉద్యోగులు జగన్‌ను కలిసి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని వినతిని అందజేశారు. రేగిడి–ఆమదాలవలస మండలం పుర్లిపేట కూడలిలో తిత్లీ తుపాను ప్రభావంతో చెరుకు పంట దారుణంగా దెబ్బతిందని, ప్రభుత్వం కనీసం తమకు వాటిల్లిన నష్టాన్ని గుర్తించలేదంటూ...ఏపీ చెరుకు రైతు సంఘం నేతలు ప్రతిపక్ష నేత వద్ద వాపోయారు. ఇదే కూడలి వద్ద భారీ సంఖ్యలో జనాల సమూహంలో జగన్‌ పాదయాత్ర సాగుతుండగా.. పాలకొండ వైపుగా వెళ్తున్న ఆంబులెన్స్‌ వాహనాన్ని చూసి, వెంటనే దారి ఇచ్చేలా చేయాలంటూ జగన్‌ సూచించడంతో ఆంబులెన్స్‌కు ఎటువంటి ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా ప్రజలు దారిని ఇచ్చారు. ఈ సంఘటనతో అక్కడున్నవారంతా..జగన్‌ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు