పొద్దు పొడవక ముందే.. పోటెత్తారు!

13 Nov, 2017 10:59 IST|Sakshi

జగన్‌ బస చేసిన ప్రాంతంలో ఆదివారం తెల్లారక ముందే వెల్లువెత్తిన జనం  

రాజన్న బిడ్డకు అడుగడుగునా నీరాజనాలు 

అభిమాన నేతకు పూల బాటలు వేసి స్వాగతం పలికిన అభిమానులు

 సమస్యలు వింటూ.. వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగిన ప్రతిపక్ష నేత 

 ఆరో రోజు 15.8 కిలోమీటర్లు పాదయాత్ర   

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పొద్దు పొడవక ముందే ప్రొద్దుటూరు పోటెత్తింది. తమ అభిమాన నేతను చూసేందుకు జనం వెల్లువలా తరలివచ్చారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాత్రి బసచేసిన ప్రాంతానికి ఆదివారం ఉదయం 6 గంటలకే జనం పోటెత్తారు. 7 గంటలకు ఆ ప్రాంతం జన సంద్రంగా మారింది. 8.30 గంటలకు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించే సమయానికి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీసాయి వెంచర్‌ జనంతో నిండిపోయింది. ఇదే ఆదరణ దారి పొడవునా.. రాత్రి బస చేసే వరకూ కొనసాగింది. జగన్‌ పాదయాత్ర అమృతనగర్, చెన్నమరాజుపల్లె, రాధానగర్, ఎర్రబల్లె మీదుగా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలానికి చేరుకుంది. అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు, కుల సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, టీచర్లు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, రైతులు వైఎస్సార్‌ సీపీ అధినేతకు తమ సమస్యలను విన్నవించారు. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 

అన్ని వర్గాలకూ అభయం  
ఉదయం 8.30 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మొదలెట్టి అమృతనగర్‌ వైపు వెళ్తున్న సమయంలో కొందరు వృద్ధులు పింఛన్లు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సుబ్బమ్మ అనే వృద్ధురాలు అమృతనగర్‌లో రహదారుల దుస్థితిని వివరిస్తూ.. గుంతలమయమైన రహదారుల వల్ల తమ మనుమరాలికి రెండుసార్లు కాళ్లు, చేతులు విరిగాయని విలపించారు. రోదిస్తున్న సుబ్బమ్మను జగన్‌ ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటుచేసిన సభలో జగన్‌ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం వచ్చాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.2 వేల చొప్పున పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్నారు. అవ్వాతాతలకు తోడుగా ఉండాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏకోశానా లేదని విమర్శించారు. అమృతనగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బుడగ జంగాల హక్కుల పోరాట సమితి నేతలు వారి సమస్యలు వివరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఎస్టీ జాబితాలో చేరుస్తామని వారికి హామీ ఇచ్చారు. పాదయాత్ర అమృతనగర్‌కు చేరుకున్నప్పుడు చేనేత కార్మికులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. రుణాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని, పిల్లలను చదివించుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేయగా, అన్ని విధాలా ఆదుకుంటానని జగన్‌ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మగ్గాన్ని తిప్పి నూలు వడికారు. పలువురు ఆటో డ్రైవర్లు, రజకులు జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. విద్యార్థి, యువజన సంఘాలు సైతం జగన్‌ను కలిసి వినతిపత్రాలిచ్చాయి.  

రుణాలు మాఫీ కాలేదని రైతుల ఆవేదన 
ప్రొద్దుటూరు పట్టణం శివారులోని హౌసింగ్‌ బోర్డు సాయిశ్రీనగర్‌ వద్ద జగన్‌మోహన్‌రెడ్డిని దూరప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కలిసి తమ గోడు వినిపించారు. వరి కంకులు, పనలతో వచ్చిన రైతులు తమకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని కోరారు. తమ రుణాలు మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి రాగానే రైతుల కష్టాలు తీరుస్తానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేయించేందుకు కృషి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) రాష్ట్ర నేతలు శ్యాంసుందర్‌రెడ్డి, ఆర్‌.వెంకటరమణ, ఏ.కృష్ణారెడ్డి తదితరులు జగన్‌ను కోరారు. చెన్నమరాజుపల్లెలో జగన్‌కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ట్రాక్టర్లలో పూలగంపలను పెట్టుకుని రోడ్డంతా చల్లుతూ, ఆ పూలపై వైఎస్‌ జగన్‌ను నడిపించారు.

కావనూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి బెదిరింపులకు పాల్పడినా.. అక్కడి ప్రజలు రాజన్న బిడ్డను చూసేందుకు వందల సంఖ్యలో రోడ్డుపైకి తరలివచ్చారు.  ఆరో రోజు యాత్రలో మొత్తం 15.8 కిలో మీటర్లు నడిచిన జగన్‌ రాత్రి 7.29 గంటలకు దువ్వూరు సమీపంలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. అనంతరం వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజారెడ్డి, ప్రసాద్‌తో పాటు పలువురు నాయకులు జగన్‌ను కలిసి సమస్యలు వివరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ఆదుకుంటామని జగన్‌ హామీ ఇచ్చారు. 

ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం.. 
పాదయాత్ర నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా నేతలు జగన్‌ను కలిసి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. 11 నెలలుగా చంద్రబాబు సర్కారు పీఆర్‌సీ బకాయిలు చెల్లించలేదని వారు జగన్‌ దృష్టికి తెచ్చారు. తాము అధికారంలోకి రాగానే పీఆర్‌సీ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. నోషనల్‌ లేని పీఆర్‌సీని అందిస్తామన్నారు. హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఆర్‌వీ జనార్దన్‌రెడ్డి వైఎస్‌ జగన్‌కు వినతి పత్రం ఇస్తూ.. జగన్‌ ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు