నేటి నుంచి వైఎస్ జగన్ ప్రాజెక్టుల యాత్ర

15 Apr, 2015 03:31 IST|Sakshi
నేటి నుంచి వైఎస్ జగన్ ప్రాజెక్టుల యాత్ర

తొలిరోజు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన
తొలుత ధవళేశ్వరం వద్ద కాటన్, వైఎస్ విగ్రహాలకు నివాళి
అనంతరం పోలవరం, పట్టిసీమ సందర్శన

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టడం ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు, రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టుల యాత్రకు బుధవారం శ్రీకారం చుడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల రైతుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో లోపాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టిన జగన్.. ఇప్పుడు పార్టీ శాసనసభ్యులతో కలసి ఈ రెండు జిల్లాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించేందుకు ఈ ప్రాజెక్టుల బాట కార్యక్రమం చేపడుతున్నారు.

పట్టిసీమ ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతులకు భరోసా ఇవ్వనున్నారు. పట్టిసీమ బాధిత రైతులతో సమావేశం కానున్నారు. ప్రాజెక్టు కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సర్కారుపై పోరాడేందుకు తామున్నామంటూ రైతులకు నైతిక స్థైర్యం ఇవ్వనున్నారు. తొలుత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులు జరుగుతున్న తీరుతెన్నులను స్వయంగా పరిశీలించనున్నారు.
 
ఈ పర్యటనలో తొలిరోజు బుధవారం (15వ తేదీ) ఉభయగోదావరి జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఉదయం 11 గంట లకు ధవళేశ్వరం వెళతారు. అక్కడ సర్ ఆర్థర్ కాటన్, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తరువాత పట్టిసీమ వద్ద ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శిస్తారు. అక్కడే పట్టిసీమ రేవులో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలు ఈ పర్యటనలో పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
 
జగన్ అండతో ఉద్యమం తీవ్రతరం..

వైఎస్ జగన్ బాసటగా నిలవడంతో పట్టిసీమ ఎత్తిపోతల వ్యతిరేక పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని డెల్టా రైతులు భావిస్తున్నారు. రాజ కీయ పార్టీలకు అతీతంగా కొనసాగిస్తున్న తమ ఆందోళనను జగన్ అండతో తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఆయన రాక కోసం ఎదురు చూ స్తూ.. జగన్‌తో కలిసి పోరుబాట పట్టాలని రైతు సంఘాల నేతలు భావిస్తున్నారు. జగన్ రాకతో పట్టిసీమ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటుం దని భావిస్తున్నారు. కాగా, రెండో రోజు గురువారం జగన్ విజయవాడలోని కృష్ణా బ్యారేజీని సందర్శిస్తారు. తర్వాత ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును, మూడోరోజు శుక్రవారం కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును సందర్శిస్తారు.

మరిన్ని వార్తలు