ఏర్పేడు బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

23 Apr, 2017 11:16 IST|Sakshi
ఏర్పేడు బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

తిరుపతి: చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించినవారి కుటుంబాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.

రేణిగుంట నుంచి వైఎస్‌ జగన్‌ మునగలపాలెం చేరుకున్నారు. మునగలపాలెంలో 13 మంది మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇసుక మాఫియా వల్లే తమవారు చనిపోయారంటూ ఏర్పేడు ప్రమాద బాధితులు వైఎస్‌ జగన్‌ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. జరిగినదానికి అంతా టీడీపీ నేతలే కారణమని చెప్పారు. మృతుల కుటుంబాలను వైఎస్‌ జగన్ పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మునగలపాలెం నుంచి వైఎస్‌ జగన్‌ ముసిలిపేడు, రావిళ్లవారి పల్లె అరుంధతివాడ ప్రాంతాలకు వెళతారు. మార్గమధ్యంలో స్వర్ణముఖి నదిలో ఇసుక గుంతలను పరిశీలించనున్నారు. ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లి, తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన దుర్ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా, మరో 15 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు