విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా పనిచేస్తున్నాం: వైఎస్‌ జగన్‌ 

1 Feb, 2020 19:59 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్‌' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. పెన్షన్ల డోర్‌డెలివరీ జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో తన నివాసంలో సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల ద్వారా ఉదయం నుంచి జరుగుతున్న పెన్షన్ల పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో పెన్షన్లు కోసం క్యూలో ఉండి నిరీక్షించాల్సి వచ్చేదని, మధ్యవర్తుల ప్రమేయం ఉండేదని, పెన్షన్ల కింద ఇచ్చే సొమ్ములో అవినీతికి పాల్పడేవారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవంటూ లబ్ధిదారుల నుంచి వచ్చిన స్పందనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికీ ఇంటివద్దకే పెన్షన్లు అందించడంతో వారంతా చాలా ఆనందం వ్యక్తం చేశారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ పాలనలో విప్లవాత్మక మార్పుగా అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నామని, దీనికోసమే ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇంటివద్దకే చేరుస్తున్నామని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి, లంచగొండి తనానికి, వివక్షకు తావులేకుండా పథకాలను లబ్ధిదారుల గడపవద్దకే చేర్చడానికి ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, పార్టీలు చూడకుండా ఓటు వేయని వారికి కూడా పథకాలు అందిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్తిస్థాయిలో సంక్షేమ పధకాలు అందిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. దీంట్లో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామన్నారు.

ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించి అత్యంత పారదర్శకరంగా జాబితాను తయారుచేసి, ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో అతికించి సామాజిక తనిఖీల కోసం ప్రజలముందే పెట్టామని, అర్హులైనవారు మిగిలిపోతే ఎవర్ని ఎలా సంప్రదించాలి, ఎలా దరఖాస్తు చేయాలన్నదానిపై ఆ జాబితాలకిందే సమాచారం ఉంచామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. ఇదే చిత్తశుద్ధితో, పారదర్శకతతో మరింత సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తామన్నాని ఆయన అన్నారు. ఈనెలలో 25 లక్షల ఇళ్లపట్టాల లబ్ధిదారుల ఎంపిక, అలాగే విద్యావసతి(జగనన్న విద్యావసతి) పథకాలకు ఇదే రీతిలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని సీఎం జగన్‌ చెప్పారు. పెన్షన్లను ఇంటివద్దకే చేర్చి అవ్వాతాతలకు, తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారికి పెన్షన్లను వారి ఇంటివద్దకే అందించే కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులకు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. 

ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఆందోళన వద్దు:
ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఆందోళన వద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎలాంటి సమస్య ఉన్నా పక్కనే ఉన్న గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలని సూచించారు. ఎవరెవరు అర్హులో గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేశామని, ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని, వీటిని అధికారులు 5 రోజుల్లో పరిశీలించి, మంజూరు చేస్తారని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టంచేశారు. 

రికార్డు స్థాయిలో ఒకేరోజు రూ.996.79 కోట్లు పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం (సాయంత్రం 8 గంటల వరకు) పదమూడు జిల్లాల పరిధిలో 996.79 కోట్ల రూపాయల పెన్షన్లను పంపిణీ చేశారు. మొత్తం 41,87,919 మంది లబ్దిదారులకు నేరుగా వారి చేతికే పెన్షన్లను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54.68 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఒకేరోజు మొత్తం లబ్దిదారులకు పెన్షన్ చేరాలనే ప్రయత్నంలో భాగంగా తొలిరోజే 75.47 శాతం మొత్తాన్ని పంపిణీ చేశారు.  శనివారం ఉదయం నుంచే గ్రామాలు, వార్డులలో ఇంటింటికీ వెళ్ళిన వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు లబ్ధిదారులకు నేరుగా పింఛను అందచేశారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల పేరుతో బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించిన ప్రభుత్వం, లబ్ధిదారులకు చెల్లించే పింఛను మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేయడం ద్వారా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు వీలు కల్పించింది. పింఛన్ల చెల్లింపు కోసం ప్రతి వాలంటీరుకు స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చారు. ఆ ఫోన్లలో బయోమెట్రిక్‌ ఆధారంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను నిర్వహించారు. ఎక్కడైనా బయోమెట్రిక్‌ సమస్య ఉత్పన్నమైతే, సరిచేసి మర్నాటికల్లా పింఛను చెల్లిస్తారు. పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం రూ.15,675.20 కోట్లు కేటాయించగా, శనివారం నాటి చెల్లింపుల కోసం రూ.1,320.14 కోట్లు విడుదల చేశారు. 

పెన్షన్ల చెల్లింపుల్లోనూ చంద్రబాబు సర్కార్ చిన్నచూపు
గత చంద్రబాబు ప్రభుత్వంలో అయిదేళ్లలో ఏడాదికి గరిష్టంగా పెన్షన్ల కోసం కేటాయించిన మొత్తం రూ. 8,234.64 కోట్లు మాత్రమే. అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల చెల్లింపు కోసం అధికారం చేపట్టిన తొలి ఏడాది అంటే 2014–15లో రూ.3378.46 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత 2015–16లో రూ.5221.73 కోట్లు, 2016–17లో రూ.5270.12 కోట్లు, 2017–18లో రూ.5436.94 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల ఏడాది కావడంతో 2018–19లో పింఛన్ల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.8234.64 కోట్లు కేటాయించింది. అధికారం చేపడితే పింఛను మొత్తం రూ.1000 నుంచి రూ.2 వేలు చేయడంతో పాటు, ఏటా రూ.250 పెంచుకుంటూ పోయి నాలుగేళ్లలో మొత్తం రూ.3 వేల పెన్షన్‌ చెల్లిస్తామని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించడంతో, గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా రూ.2 వేల చొప్పున పింఛను చెల్లించింది. అందుకే ఎన్నికల ఏడాదిలో మాత్రం రూ.8 వేల కోట్లకు పైగా కేటాయించింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన రోజు సుమారు ఇరవై అయిదు శాతం కూడా లబ్దిదారుల చేతుల్లోకి వెళ్లక పోవడం పెన్షన్లపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.

    

మరిన్ని వార్తలు