బార్ల సంఖ్య సగానికి తగ్గించండి

8 Nov, 2019 04:15 IST|Sakshi

జనవరి 1 నుంచినూతన విధానం

ఆదాయ వనరుల శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

ప్రస్తుతం ఉన్న బార్లలో ఇక 50 శాతమే ఉండాలి

లైసెన్స్‌ ఫీజు భారీగా పెంచండి 

ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే అనుమతి

ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే ఉండాలి

సాక్షి, అమరావతి: ప్రజలకిచ్చిన మాట మేరకు దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా బార్ల సంఖ్యను సగానికి సగం తగ్గించేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బార్లలో ఇక 50 శాతమే ఉండాలని, 50 శాతం కనిపించకూడదని స్పష్టం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ వనరుల శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 839 బార్లు ఉండగా ఇందులో 420 బార్లు కనుమరుగు కావాలని సూచించారు.

లైసెన్స్‌ ఫీజును భారీగా పెంచాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే బార్లు ఉండాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని కూడా తగ్గించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు తెరిచి ఉంచుతున్నారని, నూతన బార్ల విధానంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లు తెరిచి ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన నూతన బార్ల విధానాన్ని వీలైనంత త్వరగా రూపొందించాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు.  
 
మహిళా సంక్షేమమే సీఎం ధ్యేయం
ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో ఎంతో మంది మహిళల కష్టాలు విన్నారు. తమ భర్తలు తాగుడుకు బానిస కావడంతో ఎన్నో కష్టాలు పడుతున్నామని ఆయనకు చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కష్టం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. వారి కష్టాలను స్వయంగా చూసిన జగన్‌.. తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచి్చన మాట మేరకు తొలుత 43 వేల బెల్ట్‌షాపులను తొలగించారు. ఆ తర్వాత 4,380 మద్యం దుకాణాలలో 20 శాతం దుకాణాలు (880) తొలగించారు. మిగిలిన 3,500 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

మద్యంను ఆదాయ వనరుగా చూడకుండా ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా సీఎం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బార్ల సంఖ్యను సగానికి తగ్గించేయాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం గత చంద్రబాబు సర్కారు తెచ్చిన 2017 – 2022 బార్ల విధానం అమల్లో ఉంది. గతంలో వారి మద్దతుదారులకు లబ్ధి కలిగేలా ముందు చూపుతో వ్యవరించారు. ఇప్పుడు ఆ విధానం స్థానంలో సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు ప్రజలకు మేలు జరిగేలా నూతన బార్ల విధానాన్ని రూపొందిస్తాం’ అని ఎక్సైజ్‌ కమిషనర్‌ ఎం.ఎం. నాయక్‌ ‘సాక్షి’కి తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా