చదువులమ్మ గుడిలో కిలకిల రావాలు

7 Jul, 2019 06:45 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : విద్యార్థులు కిలకిల నవ్వులతో సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఏ పాఠశాలలో చూసిన విద్యార్థులు ఆట పాటలతో నవ్వుతూ... తుళ్లుతూ సంతోషంగా గడిపారు. పాఠశాలల్లో ప్రతి నెలా మొదటి, మూడో శనివారం నో స్కూల్‌ బ్యాగ్‌ డేగా పాటించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ రెండు రోజులు విద్యార్థులు ఆట పాటలతో సంతోషంగా గడపాలని, వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచనలిచ్చారు.

ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ శనివారం విద్యార్థులు పుస్తకాల బ్యాగులు తీసుకురాకుండా వచ్చారు. కుమారప్రియంలోని సానా వెంకట్రావు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.గోపాలకృష్ణాచార్యులు మాట్లాడుతూ ఆనందం వేదిక కార్యక్రమంలో తమ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారని చెప్పారు. విద్యార్థులలో ఒత్తిడిని దూరం చేసి వారిలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఎస్‌ఈఆర్‌టీ రూపొందించిన ఆనందవేదికలో మొదటి శనివారం విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా గడిపారని చెప్పారు. 

ఉదయం విద్యార్థులతో ధ్యానం చేయించారు. విద్యార్థులు పాఠశాలలోని గ్రంథాలయంలో తమకు నచ్చిన పుస్తకాలు చదువుకున్నారు. అనంతరం పలు చిత్రాలు గీశారు. మధ్యాహ్నం విద్యార్థులు సభ నిర్వహించారు. పలువురు విద్యార్థులు చక్కని నీతి కథలు చెప్పారు. పాటలు పాడారు. పొడుపు కథలు, సామెతలు చెప్పారు. తరువాత తోటపని చేసి ప్రకృతి పట్ల తమకు ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. చివరి పిరియడ్‌లో ఇన్‌డోర్, అవుట్‌డోర్‌ ఆటలు ఆడుకున్నారు. ఉపాధ్యాయుడు వి.సత్యనారాయణ, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రెడ్డి శివ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజుపాలెం పాఠశాలలో ఉపాధ్యాయుడు పి.సత్యనారాయణ విద్యార్థులకు కథలు చెప్పారు. ఆటలు ఆడించారు.  

బాగా ఎంజాయ్‌ చేశాం...
రంగంపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాలు పక్కనపెట్టి అభినయ గేయాలు, నీతి కథలు, వివిధ ఇండోర్‌ గేమ్స్‌తో సరదాగా గడిపారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. ఇప్పటికే నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ రోజు పాఠశాలలో చాలా ఆనందంగా గడిపామని, ఆటలు, పాటలు, కథలతో బాగా ఎంజాయ్‌ చేశామని విద్యార్థులు తెలిపారు. ఇప్పటి వరకూ ప్రతి శనివారం కూడా పుస్తకాలతో తరగతి గదిలోనే గడిపేవారమని, జగన్‌ సార్‌ ముఖ్యమంత్రి అయ్యాకా శనివారం నో బ్యాగ్‌ డేగా ప్రటించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు