నకిలీ విత్తనాల చలామణీపై వైఎస్‌ జగన్‌ సీరియస్‌

6 Jun, 2019 12:12 IST|Sakshi

సాక్షి, అమరావతి : నకిలీ విత్తనాల చలామణీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దన్నారు. దీనిపై నూతన విత్తన చట్టం తేవాలని వైఎస్‌ జగన్‌కు అధికారులు సూచించారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని వైఎస్‌ జగన్‌ అన్నారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలను, వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రంగా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వినియోగించే విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ  గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవలసిందిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

'ప్రభుత్వం సేవలు అందించిందీ అంటే దానికో ప్రత్యేక బ్రాండ్ పడాలి. రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలి. నాణ్యమైన విత్తనాలు గ్రామ సచివాలయాల ద్వారా రైతులకు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి జరిగిందంటే ఎవరు క్షమించలేని చర్యలు తీసుకుంటాం. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి. ఉత్తమమైన సలహాలు ఇస్తే చాలా సంతోషిస్తాను. అటువంటి వారికి సన్మానం చేస్తాం. రైతులకు బీమా సౌకర్యం సక్రమంగా అందించే పూర్తి బాధ్యత ఇక ప్రభుత్వానిదే. ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పరిష్కారాలు వంద శాతం ఉండాలి. రైతులకు ప్రయోజనాలు అందకపోతే ప్రభుత్వాలెందుకు. 62 శాతం రైతులపైనే ఆధారపడుతుంటే వారికి కావలసినవి ఏమీ చేయకపోతే ఉపయోగం ఏమిటి? రైతు సంతృప్తి చెందకపోతే ఎంత చేసినా వృధానే' అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు