15 కోట్ల భూమికి.. 30 లక్షలు ఇస్తారా?

19 Jan, 2017 10:45 IST|Sakshi
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వాటికి పప్పు బెల్లాలు ఇచ్చినట్లు ఇస్తే ఎలా కుదురుతుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా ఆయన కనకదుర్గ వారధి వద్ద సీడ్ క్యాపిటల్ యాక్సెస్ హైవే బాధిత రైతులు, ఇతరులను కలిసి మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

 
  • సీడ్ క్యాపిటల్ యాక్సెస్ అని రోడ్డు పెట్టి, దానికోసం 300 కుటుంబాలను నేలమట్టం చేసి, 25 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. 
  • ఇప్పటికే సూరాయపాలెం నుంచి మంగళగిరి టోల్ ప్లాజా వరకు ఎన్ హెచ్ 5, 9 లను లింక్ చేస్తూ, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తుళ్లూరుకు రోడ్డు వేయడానికి గత ప్రభుత్వం హయాంలోఏ భూములు తీసుకున్నా, చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల నుంచి ఇంతవరకు రోడ్డు పనులు మొదలుపెట్టలేదు. 
  • నిజంగా రోడ్డు పని చేసి ఉంటే, సీడ్ క్యాపిటల్ కు యాక్సెస్ అనేది అయిపోయి ఉండేది
  • ఈ భూములు తీసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. 
  • ఇప్పటికే భూములు తీసుకున్నా, విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి గుంటూరు రోడ్డు కోసం భూములు సిద్ధంగా ఉన్నా.. పనులు చేపట్టలేదు. 
  • ఎవరైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త రాజధానికి రోడ్డు పనులు చేయాలి. 
  • ఈయన సీఎం అయి మూడేళ్లు కావస్తున్నా ఆ పని కావాలని ముట్టుకోకుండా పక్కన పెట్టారు. 
  • ఇప్పుడు ఈ భూములను కూడా సీడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు పేరుతో 25 ఎకరాలు బలవంతంగా లాక్కుని, 300 కుటుంబాలను కూలుస్తున్నారు. 
  • ఇక్కడ ఎకరం 15 కోట్ల వరకు పలుకుతోంది. దానికి 30 లక్షలు మాత్రమే ఇస్తామని చెబుతుంటే తాము ఎలా బతకాలి, ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్నారు. 
  • ఇక్కడ ఉన్నదంతా చిన్న, సన్నకారు రైతులే. 
  • 20 సెంట్లు, 40 సెంట్ల చొప్పున ఉన్నవాళ్లంతా ఈ రోడ్డు పుణ్యమాని రోడ్డున పడాల్సి వస్తోంది. 
  • అలా రోడ్డున పడేయడం ధర్మమేనా? 

     
  • అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు.. 
  • 25 ఎకరాల భూమికి ఎకరా 15 కోట్లు ఇచ్చి తీసుకొమ్మని అడుగుతున్నాం. 
  • మోసం చేసి, రోడ్డు మీద పారేయకండి. 
  • ప్రభుత్వమే లాక్కుంటే మేం ఎవరికి చెప్పుకోవాలని చంద్రబాబును ఇక్కడివారు నిలదీస్తున్నారు. 
  • చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వీళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందని హామీ ఇస్తున్నాం. 
  • ఇదే ప్రాంతంలో వేరే ఆవాసం కూడా కల్పించకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారు. 
  • బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
  • ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రమంతా చూసేలా చేయాలి. చంద్రబాబుకు తెలిసేలా వీళ్ల నోళ్ల నుంచి వస్తున్న మాటలతో ఆయనకు బుద్ధి రావాలని అనుకుంటున్నాం. 
  • ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అడిగేది ఒక్కటే. 
  • పక్కనే విజయవాడ, అన్నీ ఫ్లాట్లే ఇక్కడ.. మేం ఫ్లాట్లు కట్టుకుంటే 15 కోట్ల వరకు వచ్చే పరిస్థితి ఉంది. 
  • పప్పు బెల్లాలు ఇచ్చి మా భూములు తీసుకుంటే సన్న, చిన్నకారు రైతులం ఏం చేయాలని అడుగుతున్నారు. 
  • మా భూములు తీసుకోవాలంటే పూర్తిగా ఎకరాకు 15 కోట్లు ఇచ్చి తీసుకోండి.. లేదా మా భూములు మాకు వదిలేయండని గట్టిగా అడుగుతున్నారు.

     
  • వాళ్ల కోరిక సమంజసమే. అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు, కానీ పేదవాళ్ల కడుపు కొట్టడం అభివృద్ధి కాదు, ధర్మంగా పేదవాళ్లకు ఇవ్వాల్సింది ఇచ్చి తీసుకోవాలి. 
  • ఆయనపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తాం. 
  • 300 ఇళ్లు తీసుకునేటప్పుడు ఇదే ప్రాంతంలో ఇళ్లు కట్టించి, ఆ తర్వాత ఇళ్లు తీసుకోవాలని అడుగుతున్న వారి కోరిక సమంజసమే. 
  • మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 
  • మిగిలిన గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా చంద్రబాబు గారికి అర్థమయ్యేలా చెబుతాం. 
  • ఈ పోరాటంలో మీకు అండగా ఉంటామని, ముందుండి పోరాడతామని హామీ ఇస్తున్నాం. 
 
ఈ పర్యటనలో భాగంగా ఆయన సీడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు బాధితులతో ముఖిముఖి మాట్లాడారు. వాళ్ల ఆవేదనను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
 
వైఎస్ తర్వాత ఎవరూ మంచి పనులు చేయలేదు
ఆ 20 ఎకరాల్లో 45 కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్లంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిందే. చంద్రబాబు చేసే పని ఏమీ లేదు. ఎప్పుడో వైఎస్ఆర్ మంచి పనులు చేశారు. ఆ తర్వాత ఎవరూ మంచి పని అన్నది చేయలేదు. అందరికీ తలా అర ఎకరం, 40 సెంట్లు.. ఇలా పోతున్నాయి. 
-రామిరెడ్డి
 
ప్రభుత్వమే లాక్కుంటే ఎవరికి చెప్పాలి
మేమిక్కడ 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం. 30 సెంట్ల భూమి, ఒక చిన్న డాబా ఇల్లు ఉన్నాయి. ఇవి యాక్సెస్ రోడ్డు కోసం పోతున్నాయి. ఇప్పుడు మేం ఎలా బతకాలి? ఏడాది పొడవునా ఆ భూమిలో గులాబి పూలు వేసుకుని నెలకు 10 వేల రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు ఇల్లు, భూమి పోతే చిన్న పిల్లలతో మేం ఎలా బతకాలి? ప్రభుత్వమే మా భూములు లాక్కుంటే ఇక మేం ఎవరికి చెప్పుకోవాలి? 
-ఆశ
 
పుష్కరాల నాడే ఇళ్లు తీసేశారు
మేం చేపలు అమ్ముకుంటాం. అమ్మానాన్నల సమయం నుంచి మేం అక్కడే ఉండేవాళ్లం. పుష్కరాల సమయంలో ఇళ్లు తీసేశారు. తర్వాత వేరేచోట మమ్మల్ని ఉంచారు. అక్కడ దోమలు కుట్టి మా చెల్లెలు చనిపోయింది. మూడు నెలల్లో వేరేచోట ఇళ్లు ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు. చేపలు అమ్ముకునేవాళ్లను అమ్ముకోనివ్వరట, చేపలు పట్టుకోనివ్వడం లేదు.
-మంగమ్మ