ఈ ఏడాదే పనులు ప్రారంభించాలి

22 May, 2020 05:08 IST|Sakshi
పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

పులివెందులలో కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై సీఎం జగన్‌ ఆదేశం

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీతో సమీక్ష

యుద్ధప్రాతిపదికన జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ – చక్రాయపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనులు

పులివెందులలో అరటి స్టోరేజీ, ప్రాసెసింగ్‌ యూనిట్, అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్‌

అనంతపురం, కడపలో అరటి ప్రాసెసింగ్‌ యూనిట్లు

గండికోట, చిత్రావతిలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయాలన్న సీఎం

సాక్షి, అమరావతి: పులివెందులలో కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఆగస్టు కల్లా టెండర్ల ప్రక్రియ చేపట్టి ఈ ఏడాదిలోనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ – చక్రాయపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనుల పురోగతిపై పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్‌ ఈ నెలాఖరుకల్లా జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియకి సిద్ధం కావాలని స్పష్టం చేశారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా)పై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.  సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

రూ.46.5 కోట్లతో లిఫ్ట్‌ స్కీంకు అనుమతులు
వేంపల్లె మండలం అలవలపాడు, పెండ్లూరు చెరువు, జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి పీబీసీ కెనాల్‌కు రూ.46.5 కోట్లతో లిఫ్ట్‌ స్కీంకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి 7 గ్రామాలకు నీరు అందించే పనులకు పరిపాలనా అనుమతులు త్వరగా ఇవ్వాలి.

అరటి స్టోరేజీ, ప్రాసెసింగ్‌ యూనిట్లు..
పులివెందులలో అరటి స్టోరేజి, ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అరటి సాగు ఎక్కువగా ఉండే అనంతపురం, కడప తదితర చోట్ల ప్రాసెసింగ్‌ యూనిట్లు సిద్ధం చేయాలి. అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టి శిక్షణ ప్రారంభించాలి. అరటి, టమాటా, బత్తాయి దిగుబడి సమస్యలు తలెత్తకుండా, రైతులు నష్టపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలి.

పక్కదారి పట్టిన ట్రిపుల్‌ ఐటీ నిధులను రాబట్టాలి.. 
► గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్‌ ఐటీ నిధులను పక్కదారి పట్టించిన అంశం సమీక్షలో చర్చకు వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్‌ ఐటీల్లో  పక్కదారి పట్టిన నిధులను వెనక్కి రప్పించే ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. గండికోట, చిత్రావతి రిజర్వాయర్లలో ఈ ఏడాది పూర్తిస్ధాయిలో నీటిని నిల్వ చేయాలన్నారు. వ్యవసాయ సలహా కమిటీలను త్వరగా నియమించి చిరు ధాన్యాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏపీ కార్ల్‌ పనితీరుపై అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్‌ ఏర్పాటుపై మరింత శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. 
► పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పులివెందులలో 255 ఎకరాల్లో జిల్లాలో అతి పెద్ద లేఅవుట్‌ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. 
► సమీక్షలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్, వివిధ శాఖల ఉన్నతాధికారులతోపాటు పాడా అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు