బాధితుల భద్రతే ముఖ్యం

8 May, 2020 03:33 IST|Sakshi
ఎయిర్‌పోర్ట్‌లో ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్యంతో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ప్రభావిత గ్రామాల్లో గ్యాస్‌ కాలుష్య పరిస్థితిని అధ్యయనం చేయండి

అప్పటి వరకు బాధితులకు షెల్టర్లలో వసతి ఇవ్వండి

అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

జిల్లా కలెక్టర్, పోలీసులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి అభినందనలు

సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులకు, గ్రామాల్లో వారి ఆస్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ను ఆదేశించారు. గ్యాస్‌ ప్రభావం తగ్గిన తర్వాత సురక్షిత పరిస్థితి ఏర్పడి.. బాధితులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లేవరకూ షెల్టర్లలో వసతి కల్పించాలని సూచించారు. గురువారం ఆయన కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన అనంతరం ఆంధ్రా వైద్య కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దుర్ఘటన జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన విషయాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.  

రిఫ్రిజిరేషన్‌ సరిగా జరగకే..
► ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో తెల్లవారుజామున గ్యాస్‌ లీక్‌ అయ్యింది. ఘటన జరిగిన ప్రదేశంలో 2,500 కిలోలీటర్ల ట్యాంకు, మరొకటి 3,500 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్నవి ఉన్నాయి.
► 2,500 కేఎల్‌ ట్యాంకు నుంచే తొలుత గ్యాస్‌ లీక్‌ మొదలైంది. దీనిలో 1,800 కేఎల్‌ స్టైరీన్‌ ద్రవ రూపంలో ఉంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వరకూ ఇది సురక్షితం. సాంకేతిక కారణాల వల్ల రిఫ్రిజిరేషన్‌ సరిగా జరగలేదు. దీంతో అది గ్యాస్‌ రూపంలోకి మారి లీక్‌ అయ్యింది.
► గ్యాస్‌ లీకైన వెంటనే కంపెనీ పరిసరాల్లోని వెంకటాపురం, పద్మనాభపురం, ఎస్సీ, బీసీ కాలనీల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రధానంగా వెంకటాపురం గ్రామంపై తీవ్ర ప్రభావం పడింది. 5.30 గంటలకల్లా అధికార యంత్రాంగం ఘటన స్థలికి చేరుకుంది. 
► గురువారం ఉదయం 9.30 గంటల సమయానికి 122.5 పీపీఎం స్థాయిలో గ్యాస్‌ గాలిలో ఉంది. ఇది పూర్తిగా తగ్గాలి. దీనికి 24 గంటల సమయం పట్టవచ్చు. దీనివల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో పాటు చర్మ వ్యాధుల ప్రమాదం ఉంటుంది.
► గ్యాస్‌ ప్రభావం పరిధి 1.5 కి.మీ నుంచి 2 కి.మీ ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. గ్యాస్‌ లీకేజీ ప్రదేశంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీటిని వెదజల్లుతున్నాం. ఈ ప్రమాదం కారణంగా పది మంది చనిపోయారు. 22 పశువులు మృత్యువాత పడ్డాయి.(పెద్దాయనా.. ఎలా ఉన్నావు?)

మరోసారి నిపుణులతో అధ్యయనం
► బాధిత ప్రజలకు పునరావాసం కల్పించే బాధ్యత జిల్లా కలెక్టర్‌ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వాతావరణంలో గ్యాస్‌ విష ప్రభావాన్ని మరోసారి నిపుణులతో అధ్యయనం చేయించాలని, పూర్తిగా సురక్షితమని తేలిన తర్వాతే బాధితులను ఇళ్లకు పంపాలన్నారు.షెల్టర్లను ఏర్పాటు చేసి, మంచి భోజనం అందించాలన్నారు. గ్రామాల్లో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని సూచించారు.
► ప్రమాద సంఘటన సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన స్పందించిన జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీసు అధికారులను సీఎం జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.

సైరన్‌ ఎందుకు మోగలేదు?
ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం
విష వాయువు లీకేజీ దుర్ఘటనకు సంబంధించి సైరన్‌ ఎందుకు మోగలేదని ఎల్జీ పాలిమర్స్‌ ప్రతినిధులపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేజీహెచ్‌ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్యం, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెల్లవారుజామున స్టైరీన్‌ గ్యాస్‌ లీక్‌ అయినప్పుడు సమీప గ్రామాల ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని ఆరా తీశారు. ఆ సమయంలో అలారం ఎందుకు మొగలేదని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని సీఎస్‌ నీలం సాహ్నిని సీఎం ఆదేశించారు. ప్రమాద ప్రభావిత ఐదు గ్రామాల ప్రజల సంరక్షణ బాధ్యతను ఐదుగురు మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసులకు అప్పగించారు.
(విశాఖ విషాదం)

మరిన్ని వార్తలు