ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో లంచాలకు తావుండదు

18 Dec, 2019 04:31 IST|Sakshi

అందుకే ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

గతంలో ఈ ఉద్యోగాలిచ్చినప్పుడు భారీగా వసూళ్లు

జీతాలిచ్చేటప్పుడు కూడా లంచాలు తీసుకున్నారు

తుదకు శానిటేషన్‌ పనులు కూడా చంద్రబాబు బంధువుకే 

ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. లంచాలకు తావు లేకుండా ఉద్యోగాలిస్తాం. నేరుగా వారి జీతాలు వాళ్లకే అందిస్తాం.

సాక్షి, అమరావతి:  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు వారికి పూర్తిగా చెల్లించడంతో పాటు.. ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేసేందుకే ఏపీ ఔట్‌సోర్సింగ్‌ సర్వీసుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఇంతకంటే పారదర్శకంగా, గొప్పగా ఎక్కడా ఉండదని, చాలా స్పష్టంగా మార్గదర్శకాల్లో రాస్తే ఎక్కడా లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇన్‌చార్జ్‌ మంత్రులను పెట్టి ఉద్యోగులను తీసేసే కార్యక్రమాలు చేస్తున్నామని నీచమైన ఆరోపణలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టినా విపక్ష సభ్యులు బురద చల్లుతున్నారని, ప్రతీది రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షం నిత్యం దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ..  అసత్యాలు చెబుతున్నారని, అందుకే ఈ అంశంపై ప్రివిలేజ్‌ మోషన్‌కు వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అంశంపై మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఈ వ్యవస్థలో మార్పు కోసమే.. 
‘‘ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వడం కోసం లంచాలు, తర్వాత జీతాలు ఇవ్వాలంటే మాకింత ఇస్తేనే అంటూ వసూళ్లు.. మొత్తంగా ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అందరూ నష్టపోతున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం. ఈ పేరుతో చివరకు గుళ్లలో శానిటేషన్‌ పనుల (క్లీనింగ్‌) కాంట్రాక్ట్‌ కూడా చంద్రబాబునాయుడు బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చారు. మొత్తం మీద వాళ్లకు సంబంధించిన వాళ్లను పెట్టుకుని పూర్తిగా దోచేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ వ్యవస్థ నడిపితే ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే విధంగా మేం కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం’’.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా