‘అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికెట్’

15 Mar, 2017 10:10 IST|Sakshi
‘అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికెట్’

అమరావతి: దేవాదాయ భూములను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ. 70 కోట్లు విలువ చేసే భూములను సిద్ధార్థ విద్యాసంస్థకు కారు చౌకగా ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఎకరా లక్షన్నరకు లీజుకు రాటిఫై చేయడం ధర్మమేనా అని అడిగారు. 2006లో ప్రభుత్వం లీజును రద్దు చేసిందని, దీన్ని 2010లో హైకోర్టు సమర్థించిందని వెల్లడించారు. 10 శాతం మార్కెట్ విలువ ప్రకారం ఇస్తే లీజుకు ఇస్తే ఫర్వాలేదన్నారు. ఎకరా రూ. 7 కోట్లకు లీజుకు ఇస్తే ఆక్షేపణ ఉండదని చెప్పారు.

సదావర్తి భూముల విషయంలోనూ ప్రభుత్వం ఇదే వ్యవహరించిందని ఆరోపించారు. అన్యాక్రాంతం కాని 83 ఎకరాల భూములను ఎకరా రూ. 22 లక్షలకు అమ్మేసిందని దుయ్యబట్టారు. మార్కెట్ ధర రూ. 7 కోట్లు ఉంటే రూ. 22 లక్షలకు అమ్మడం సరికాదని దేవాదాయ ప్రాంతీయ కమిషనర్ రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. సదావర్తి భూములను అప్పనంగా కట్టబెట్టడంపై కోర్టును ఆశ్రయిస్తే విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ఎకరాకు రూ. 22 లక్షల కంటే ఎక్కువ ఇస్తే రిజిస్ట్రేషన్ చేయబోమని, సేల్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తామని టీడీపీ సర్కారు చెప్పింది. అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికెట్ అన్నట్టుగా ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. సదావర్తి భూముల పాపం కచ్చితంగా చంద్రబాబుకు తగులుతుందని వైఎస్ జగన్ అన్నారు.