‘శవాలమీద పేలాలు ఏరుకునే రకం చంద్రబాబు’

30 Dec, 2018 17:51 IST|Sakshi

పలాస బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, శ్రీకాకుళం: తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. తుపాను కారణంగా రూ.3450కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాసి, కేవలం 500 కోట్లు మాత్రమే బాధితులకు చెల్లించారని జగన్‌ వెల్లడించారు. తుపాను కారణంగా నష్టపోయిన పోయిన వారికి చంద్రబాబు చెక్కులు ఇచ్చారుకానీ ఆ చెక్కుల్లో డబ్బులు మాత్రం ఇంతవరకు వెయ్యలేదని విమర్శించారు. బాధితులకు వచ్చే నష్టపరిహారం కూడా దోచుకుంటున్నారని, శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా చంద్రబాబు తీరు ఉందని జగన్‌ వ్యాఖ్యానించారు. తుపానులో సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రజాసంకల్పయాత్ర  333వ రోజు పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

‘‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిత్లీ బాధితులను ఆదుకుంటాం. తుపానులో కొబ్బరిచెట్లు కోల్పోయిన రైతుకు ప్రతీ చెట్టుకు 3000 చొప్పున చెల్లిస్తాం. ఇళ్లు కోల్పోయినవారికి కొత్త ఇళ్లు కట్టిస్తాం. పలాస జీడిపప్పుకు ఎంతో ప్రసిద్ధిచెందినది. కానీ టీడీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ట్యాక్స్ ఫేమస్‌గా తయారైంది.  పలాస ఎమ్మెల్యే అల్లుడి గిల్లుడును తట్టుకోలేకపోతున్నామని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. ఆయన పేరు వెంకన్న చౌదరి. ఇక్కడ ఏం చేయాలన్నా ఆయనకు ట్యాక్స్‌ కట్టి చేయాలి. ఇక్కడి ప్రజల ఎక్కువగా జీడిపప్పు పంటపై ఆధారపడి ఉన్నారు. వాటిపై కూడా జీఎస్‌టీ పేరుతో దోపిడీ చేస్తున్నారు’’ అని అన్నారు.



‘‘బయట మార్కెట్‌లో కేజీ జీడిపప్పు 600కు తక్కువగా ఉంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో మాత్రం 1100 ఉంటుంది. దళారీ వ్యవస్థను అడ్డుకోవాల్సిన సీఎంయే పెద్ద దళారీగా తయారైయ్యారు. ఈప్రాంతంలో వైఎస్సార్‌ హయాంలో 35వేలకు పైగా ఇళ్లను నిర్మించారు. కానీ నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు ఒక్కటైనా కట్టించారా. పలాస, ఇచ్చాపురం, టెక్కలి ప్రాతంలో కిడ్నీ బాధితులు ఉన్నారు. వారికోసం గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలుచేయలేదు. డయాలసిస్‌ సెంటర్‌, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చంద‍్రబాబు అన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో పునాదిరాయి కూడా పడలేదు.  మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్‌ సెంటర్‌ను, కిడ్నీ రిసెర్చ్‌ హాస్పిటల్‌ను రెండువందల పడకల గదులతో ఏర్పాటు చేస్తాం. చంద్రబాబుకు తోడు పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి కూడా కిడ్నీ బాధితుల కోసం ఇక్కడికి వస్తాడు. కానీ చేసేందేమీ లేదు. బాబుకు కష్టం వచ్చినపుడల్లా ఆయన పార్టనర్ వస్తాడు’’ అని జగన్‌ విమర్శించారు.

కేసీఆర్‌ ప్రకటన ఆహ్వానించాలి..
‘‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ పక్క రాష్ట్రం అయినప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తా అన్నారు. ఆయన ప్రకటనను ఆహ్వానించాల్సింది పోయి దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మనకున్న ఎంపీలకు తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా తోడైతే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురాచ్చు’’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు