'తుపాను సాయంలో ఏపీ ప్రభుత్వం విఫలం'

9 Nov, 2014 16:52 IST|Sakshi
'తుపాను సాయంలో ఏపీ ప్రభుత్వం విఫలం'

ఢిల్లీ: ఉత్తరాంధ్ర తుపాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన జగన్.. హుదూద్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్... కేంద్ర నుంచి తుపాను సాయాన్ని మరింత పెంచాలని కోరామని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా గ్రామాల్లో విద్యుత్ ను పునరుద్ధరించలేదన్నారు. పది రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటిస్తే.. ప్రతీ గ్రామంలోనూ ఎలాంటి సాయం అందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు.

 

తుపాను సాయం గురించి ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ పనిచేయకపోగా, పని చేసే వారిపై బురద జల్లుతారని జగన్ మండిపడ్డారు. సుజనా చౌదరికి కేబినెట్ లో చోటు కల్పించడంలో చూపిన శ్రద్ధ, తుపాను బాధితుల సాయం కోరడంలో చూపలేకపోవడం దారుణమని జగన్ అన్నారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన బృందంలో వైఎస్ జగన్తో పాటు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.

 

మరిన్ని వార్తలు