విశాఖకు రానున్న సీఎం వైఎస్‌ జగన్‌

7 May, 2020 08:56 IST|Sakshi

విశాఖపట్నం : జిల్లా పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జి పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున రసాయన వాయువు లీకేజీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా, 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. గ్యాస్‌ లీకేజీ జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరికొద్ది సేపట్లో రానున్నారు. పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. అంతకుముందు ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

గ్యాస్ లీకేజీ తగ్గడంతో ఆర్‌ఆర్‌ వెంకటాపురంతో పాటు చట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా గ్యాస్‌ లీకేజ్‌ అవడంతో గంగరాజు అనే స్థానికుడు ప్రాణ భయంతో పరుగులు తీస్తూ కళ్లు సరిగా కనిపించకపోవడంతో నేల బావిలో పడి మృతి చెందాడు. గ్యాస్ తీవ్రతకు పలు ప్రాంతాల్లో పశువులు మృతి చెందగా, చెట్లు, మొక్కలు నల్లగా మాడిపోయాయి.

సమాచారం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఘటనా స్థలిలో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయకచర్యలు చేపట్టారు.. బాధితులకు అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా కేజీహెచ్‌తో పాటు విశాఖ కేర్‌, సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్న 14 మందికి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. (విశాఖ ఎల్‌జి పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

మరిన్ని వార్తలు