వస్తున్నాడు నేడు.. వరాల రేడు

20 Jun, 2019 08:19 IST|Sakshi

జిల్లాకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో రాక..

పోలవరం ప్రాజెక్టు సందర్శన, అధికారులతో సమీక్ష

కొయ్యే మోషేన్‌రాజు కుమారుడి వివాహానికి హాజరు

పోలవరం కొండలు నిలువెల్లా కనులై నిరీక్షిస్తున్నాయి. గోదారమ్మ ఉత్సాహంతో ఉరకలెత్తుతోంది. వరాల తొలకరి కురవబోతున్నట్టు పశ్చిమ సీమ అంగరంగ సంబరంగా పచ్చని తివాచీ పరిచింది. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్న నవ్యాంధ్ర నవరత్నం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికిస్వాగతం పలికేందుకు సిద్ధమైంది.   

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో పశ్చిమ జిల్లా పర్యటనకు రానున్నారు. ఆయన గురువారం పోలవరం ప్రాజెక్టు సందర్శనతోపాటు ఉండిలో వైఎస్సార్‌ సీపీ నేత కొయ్యే మోషేన్‌రాజు కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. జలవనరుల శాఖ మంత్రిఅనిల్‌కుమార్‌ యాదవ్, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పోలవరం, రాప్తాడు ఎమ్మెల్యేలు బాలరాజు, ప్రకాష్‌రెడ్డి బుధవారం పోలవరాన్ని సందర్శించారు.

పోలవరానికి మూడోసారి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పోలవరం ప్రాజెక్టుకు తొలిసారి వస్తుండగా, గతంలో రెండుసార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు.  2011 ఫిబ్రవరి 7న రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకూ హరిత యాత్ర పేరుతో 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలన్న డిమాండ్‌తో ఈ యాత్ర సాగింది. 2015 ఏప్రిల్‌ 15న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సందర్శన కోసం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలతో బస్సు యాత్ర నిర్వహించారు. ఇప్పుడు సీఎం హోదాలో ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.  

పోలవరం పనులపై ఆరా తీస్తున్న మంత్రులు అనిల్, నాని, ఎమ్మెల్యేలు బాలరాజు, ప్రకాష్‌రెడ్డి తదితరులు

పోలవరంపై సీఎం ఫోకస్‌    
సీఎం అయిన తర్వాత ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై ఓసారి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.  సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి చర్చించారు. కేంద్రం సానుకూలంగా స్పందించి 3,100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడానికి సానుకూలత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సమీక్షలో అధికారులు చెప్పిన అంచనాలకు తగ్గట్టు, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో లేదో పరిశీలించనున్నారు. కుడి, ఎడమ కాలువల నిర్మాణంలో పురోగతితోపాటు జలాశయం నిర్మాణం తీరుతెన్నులను పరిశీలించబోతున్నారు. అక్కడే భూసేకరణ, పునరావాసంపైనా అధికారులతో సమీక్షిస్తారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఇప్పటికే ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది. ఎక్కడ, ఏ స్థాయిలో అవినీతి జరిగిందనే విషయాన్ని అధికారులు ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌కు లెక్కలతో సహా సమర్పించారు.

గత ప్రభుత్వ ప్రచార ఆర్భాటం
పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం ప్రచారార్భాటం కోసం వాడుకుంది. ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యం వహించింది. 2018 నాటికి గ్రావిటీతో నీరు ఇస్తాం రాసుకోమంటూ అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అసెంబ్లీలో వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్వాసితులను పూర్తిస్తాయిలో తరలించి, ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇవ్వగలిగితేనే ప్రాజెక్టు పూర్తయినట్లు. 70.02 శాతం పనులు పూర్తి చేశామని చెబుతున్నారు.  లక్షా ఐదు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ  3 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. అంటే 3 శాతంలోపు మాత్రమే పునరావాస కార్యక్రమాలు జరిగాయి.  చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు రోజువారీ సమీక్షలతో సరిపెట్టారు.  సోమవారం పోలవారం అంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. పనుల్లో అవినీతి పెద్ద ఎత్తున జరిగింది.

అవినీతి రహిత పనులే లక్ష్యం
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తూనే అవినీతి రహితంగా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. ప్రాజెక్టులో కొన్ని పనులకు సంబంధించిన టెండర్లను పునఃసమీక్షించాలని ఆయన ఇదివరకే నిర్ణయించారు. అంచనా వ్యయాన్ని కాస్త తగ్గించడంతోపాటు, సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సమీక్షించనున్నారు. చంద్రబాబు హయాంలో అమరావతి తర్వాత అతిపెద్ద కుంభకోణం పోలవరం ప్రాజెక్టులోనే జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరంపై ముఖ్యమంత్రి ఫోకస్‌ పెట్టడంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ముంపు బాధితులకు జగన్‌ భరోసా
2006, 2007, 2008 సంవత్సరాల్లో ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చి ఎకరానికి రూ.లక్షా 15 వేల నుంచి రూ. లక్షా 45 వేలు మాత్రమే తీసుకున్న రైతులకు మానవతా దృక్పథంతో ఎకరానికి అదనంగా ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని కుటుంబానికి రూ.పది లక్షలకు పెంచుతామని 2016 కుక్కునూరు పర్యటనలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వారిలో భరోసా నింపారు.  2006–07 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు నిమిత్తం భూములు కోల్పోయిన వారిలో  ముంపు గ్రామాల్లో ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు, ఓటర్‌ కార్డు, ఇంటి పన్ను రశీదుల వంటి గుర్తింపులు ఉండి జీవనభృతి కోసం విద్య, వైద్య అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు తాత్కాలికంగా వెళ్లిన వారిని నిర్వాసితుల జాబితా నుంచి అప్పటి ప్రభుత్వం తొలగించింది.  భూమిని కోల్పోయి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి ఇప్పటివరకూ పొందని వారిని ప్రాజెక్టు డిస్‌ప్లేస్‌డ్‌ ఫ్యామిలీగా గుర్తించి ప్యాకేజిలోని అన్ని ప్రయోజనాలు కల్పిం చాలని ముంపు మండలాల ప్రజలు కోరుకుంటున్నారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్లు కూడా చాలా చిన్నవిగా ఉండి నివాసయోగ్యంగా లేవని నిర్వాసితులు చెబుతున్నారు. కొంతమంది తమ గృహాలు తామే నిర్మించుకుంటామని నగదు ఇవ్వాలని కోరుతున్నారు.

పోలీసు బందోబస్తు
పోలవరం రూరల్‌: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ప్రాజెక్టు వద్ద, కొండ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. డీఐజీ ఏఎస్‌ ఖాన్, ఎస్పీ నవదీప్‌సింగ్‌  బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌ పోలీసులకు విధులు కేటాయించారు.   

సీఎం పర్యటన సాగేదిలా..
ఏలూరు (మెట్రో): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10.30 గంటలకు ఉండి చేరుకుంటారు. 10.45 గంటలకు ఉండి కోట్ల ఫంక్షన్‌ హాలులో జరిగే వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ కె.మోషేన్‌రాజు కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11.05 గంటలకు ఉండి హెలీప్యాడ్‌ నుంచి బయలుదేరి ఉదయం 11.25 గంటలకు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్‌ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 2.10 గంటలకు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్‌ హెలీప్యాడ్‌ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 2.55 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు.

మరిన్ని వార్తలు