2న కడప జిల్లాకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాక

31 Aug, 2019 08:13 IST|Sakshi

 పర్యటన విజయవంతానికి కలెక్టర్‌ హరికిరణ్‌ పిలుపు

సాక్షి, కడప: సెప్టెంబరు 2వ తేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారని, పర్యటన విజయవంతానికి పటిష్ఠవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరి కిరణ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు సెప్టెంబరు 2వ తేది ఉదయం నుంచి మ«ధ్యాహ్నం వరకు ఇడుపులపాయ, పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. దీనికి సంబంధించి మినిట్‌ టు మినిట్‌ రావాల్సి ఉందన్నారు.

సెప్టెంబరు 2వ తేది ఉదయం ప్రత్యేక విమానంలో సీఎం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు వెళతారన్నారు.  వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి పులివెందులకు చేరుకుంటారన్నారు. మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి విహ్రావిష్కరణ చేసి అనంతరం పులివెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ పాడాకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. సమావేశానంతరం పులివెందుల నుంచి హెలికాఫ్టర్‌లో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారని వివరించారు.

ఈ సందర్బంగా కడప ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్‌ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్, ఎక్సైజ్‌ డీసీలను ఆదేశించారు. ఇడుపులపాయ, పులివెందులలో హెలిప్యాడ్‌ల వద్ద బారికేడ్ల నిర్మాణం, అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ, పోలీసులు అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పారిశుద్ద్యం, సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. పులివెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను తనిఖీ చేసి ప్రోటోకాల్‌ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. ఇడుపులపాయ, పులివెందులలో వైద్య బృందాలు అవసరమైన మందులతో సిద్దంగా ఉండాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జేసీ గౌతమి, ట్రైనీ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్, డీఆర్వో రఘునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు