నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయకు రాక

2 Sep, 2019 07:46 IST|Sakshi

వైఎస్సార్‌ ఘాట్‌వద్ద కుటుంబ సభ్యుల నివాళి

పులివెందులలో వైఎస్‌ వివేకా విగ్రహం ఆవిష్కరణ

అధికారులతో  సమీక్ష సమావేశం

సాక్షి, పులివెందుల : దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సోమవారం జిల్లాకు రానున్నారు.    ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప ఏయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుండి హెలికాప్టర్‌లో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు వెళతారు. అక్కడ తన తండ్రి దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల హెలిప్యాడ్‌ చేరుకొని రోడ్డుమార్గంలో స్థానిక పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

నివాళులర్పించనున్న కుటుంబ సభ్యులు  
సోమవారం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిలమ్మ, వైఎస్‌ జగన్‌ సతీమణీ వైఎస్‌ భారతిరెడ్డి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్నారు. అనంతరం వైఎస్‌ కుటుంబ సభ్యులు పులివెందులలోని పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్‌ వివేకా విగ్రహావిష్కరణలో వైఎస్‌ వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి,ఇతర కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. 

సమీక్ష సమావేశం :
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందులలోని స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహాంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్, పులివెందుల పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు.పులివెందుల నియోజకవర్గంలో మండలాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు దశానిర్ధేశం చేయనున్నారు. 
మెగా రక్తదాన శిబిరం :
వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా స్థానిక బాకరాపురంలో గల వైఎస్సార్‌ ఆడిటోరియంలో పులివెందుల వైఎస్సార్‌ సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరం ఉదయం 6గంటలకే ప్రారంభమవుతుందని.. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమనులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని వైఎస్‌ మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.   

పటిష్ట బందో బస్తు :
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సజావుగా సాగేందుకు కడప ఎస్పీ అభిషేక్‌ మహంతి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్‌ ఎస్పీ ఒకరు, డీఎస్పీలు ఏడుగురు, సీఐలు 17మంది, ఎస్‌ఐలు 40మంది, ఇతర పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం 1132మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయికి సంబంధించిన రిహార్సల్స్‌ను కూడా పట్టణంలో నిర్వహించారు.  

సీఎం పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 6.30గంటలకు తాడేపల్లిలోని  తన నివాసం నుంచి బయలుదేరి 6.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 7గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరుతారు. 7.40గంటలకు కడప ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.అక్కడ హెలికాప్టర్‌లో 7.50గంటలకు ఇడుపులపాయకు బయలుదేరుతారు. 8.10గంటలకు ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 8.15 గంటలకు అక్కడ నుంచి రోడ్డుమార్గాన వైఎస్సార్‌ ఘాట్‌కు బయలుదేరుతారు. 8.20గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకుంటారు.

8.30గంటల నుంచి 9.30గంటల వరకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులతోకలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 9.35గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి హెలిప్యాడ్‌ వద్దకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 9.40గంటలకు ఇడుపులపాయ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ చేరుకుంటారు. 9.45గంటలకు ఇడుపులపాయనుంచి పులివెందుల బయలుదేరి వెళతారు. 10.05గంటలకు పులివెందుల బాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.10గంటలకు రోడ్డుమార్గాన పాలకేంద్రం వద్దకు బయలుదేరుతారు. 10.20గంటల నుంచి 10.50 గంటల వరకు దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

10.55గంటలకు అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఆర్‌అండ్‌బీ బంగ్లాకు బయలుదేరుతారు. 11గంటల నుంచి 12.30గంటల వరకు అక్కడ పులివెందుల ప్రాంత అభివృద్ధిపై అధికారులతో సమీక్షసమావేశం నిర్వహిస్తారు. 12.30 గంటల నుంచి 1.30గంటల వరకు రిజర్వ్‌గా ప్రకటించారు. 1.30గంటలకు ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి బాకరాపురం హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు. 1.35గంటలకు బాకరాపురం హెలీప్యాడ్‌ చేరుకుంటారు. 1.45గంటలకు అక్కడ నుండి హెలికాప్టర్‌లో కడప ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 2.15గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.30గంటలకు కడప ఎయిర్‌పోర్టునుంచి  ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరుతారు. 3.10గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు  చేరుకొంటారని కడప కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారికంగా ప్రకటించారు. 


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా