జలదీక్షతోనైనా సీఎం బుద్ధి తెచ్చుకోవాలి

19 May, 2016 02:09 IST|Sakshi
జలదీక్షతోనైనా సీఎం బుద్ధి తెచ్చుకోవాలి

లేకుంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు
నాడు ఆల్మట్టిని అపలేక కృష్ణా డెల్టాను ముంచారు
నేడు రెండు డెల్టాలను ముంచుతున్నారు
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం

 
మంగళగిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షకు వెల్లువెత్తిన జనస్పందనను చూసైనా ముఖ్యమంత్రి చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని అక్రమ ప్రాజక్టులను అడ్డుకోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) హితవు పలికారు. బుధవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు గత పాలనలో, కర్నాటక ఆల్మట్టి ఎత్తును పెంచుతుంటే అడ్డుకోలేక కృష్ణా డెల్టాను ముంచారని, మరలా ఇప్పుడు కృష్ణా,గోదావరి నదులపై జరుగుతున్న అక్రమ ప్రాజక్టులను అడ్డుకోలేక రెండు డెల్టాలను ముంచుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణతోపాటు పైరాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమప్రాజక్టులను అడ్డుకోకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు ఢిల్లీ  వెళ్లి ఏమి సాధించారని ప్రశ్నించారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కయి అక్రమప్రాజక్టులపై కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫిర్యాదు చేయలేని స్థితికి చంద్రబాబు దిగజారారని ఎద్దేవా చేశారు. లేకపోతే ప్రధానమంత్రి మోదీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.  తెలంగాణను నిలదీయలేకపోవడం వల్లే కృష్ణా,గోదావరి నదులపై ఆ రాష్ట్రం ఇస్టానుసారం అక్రమ ప్రాజక్టులు కడుతోందన్నారు. పట్టిసీమ పోలవరం ప్రాజక్టులో అంతర్భాగం కాదని,  టీడీపీ నాయకుల సంపాదన కొరకు నిర్మించిన అక్రమ ప్రాజక్టు అని తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన విమర్శలకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నామని చెబుతున్న టీడీపీ నాయకులు,  జగనన్న జలదీక్షకు జిల్లాలో ప్రజల నుంచి వెల్లువెత్తిన అభిమానాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు.

జలదీక్ష జగనన్న మీద అభిమానంతో పాటు తమ పార్టీపై ఆగ్రహంగా మారిందని భావించిన మంత్రులు ఓర్వలేక విమర్శలు చేసి, తమ చేతకాని తనాన్ని బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, నాయకులను విమర్శించాల్సిన టీడీపీ నాయకులు రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్న జగనన్నను విమర్శించడం ఏమిటని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను, నాయకులను తీసుకున్నామని మురిసిపోతున్న టీడీపీ నాయకులు ప్రజలలో వైఎస్సార్‌సీపీపై ఉన్న అభిమానాన్ని తీసుకెళ్లలేమని గుర్తించుకోవాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు