కొద్దిగా మెరుగుపడిన జగన్ ఆరోగ్యం

2 Sep, 2013 02:44 IST|Sakshi
కొద్దిగా మెరుగుపడిన జగన్ ఆరోగ్యం
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం ఆదివారం సాయంత్రానికి కొద్దిగా కుదుట పడింది. ఏడు రోజుల దీక్షను భగ్నం చేస్తూ, శనివారం ఫ్లూయిడ్స్ ఎక్కించిన నిమ్స్ వైద్యులు ఆదివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిమ్స్ వైద్య బృందం డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ శ్రీభూషణ్‌రాజులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చక్కెర నిల్వలు కొద్దిగా  పెరిగాయని, రక్తపోటు(బీపీ) కూడా నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. కీటోన్స్ కూడా తగ్గుముఖం పట్టాయని, అయితే సోడియం నిల్వలు ఇంకా రికవరీ కావాల్సి ఉందని తెలిపారు. 
 
 ఏడు రోజులుగా దీక్ష చేయడంవల్ల శరీరంలో ఉన్న కొవ్వులు పూర్తిగా కరిగిపోయాయని, ఈ కారణంగానే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. జగన్ ఇప్పటికీ నీరసంగానే ఉన్నారని, సాధారణ స్థితికి చేరుకోవాలంటే బలమైన ఆహారం తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఆదివారం కూడా జగన్‌కు అవసరమైన మేరకు ఫ్లూయిడ్స్ ఎక్కించామని, రానున్న రెండ్రోజులు కూడా ఈ తరహా ఫ్లూయిడ్స్ ఇస్తామని తెలిపారు. ఫ్లూయిడ్స్‌తో పాటు ఆయన ఏదైనా పళ్ల రసాలు లేదా ఆహారం తీసుకుంటే మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు. జగన్ ఆదివారం కొద్దిగా పుచ్చకాయ రసం తీసుకున్నట్టు వైద్యులు తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడేవరకూ వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని నిమ్స్ వైద్య బృందం తెలిపింది. నిమ్స్ వైద్య బృందంలో ప్రముఖులైన డాక్టర్ శేషగిరిరావు (కార్డియాలజీ), డాక్టర్ శ్రీభూషణ్‌రాజు (నెఫ్రాలజీ), డాక్టర్ వైఎస్‌ఎన్ రాజు (జనరల్ మెడిసిన్)లు ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. 
 
నిమ్స్‌తరహా ఆస్పత్రి జిల్లాకొకటి ఉండాలి: జగన్
తనలాగే సాధారణ పేషెంట్లకూ నిమ్స్ తరహా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యులతో అన్నారు. ఆదివారం జగన్‌ను పర్యవేక్షిస్తున్న వైద్యులతో ఆయన కొద్దిసేపు మాట్లాడినట్టు తెలిసింది. సుదూర ప్రాంతాల నుంచి అందరూ నిమ్స్‌కు రాలేరని, నిమ్స్ స్థాయి ఆస్పత్రులను జిల్లాకొకటి తీర్చిదిద్దితే లక్షలాది రోగులకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. దీంతోపాటు నిమ్స్‌కు వచ్చే ఆరోగ్యశ్రీ రోగులకు అందుతున్న సేవలపైనా వాకబు చేశారు. కిడ్నీ బాధిత రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కోరారు. ముఖ్యంగా యువకుల్లో వచ్చే రుగ్మతలపైన దృష్టిసారించి ఆయా జబ్బులను ప్రాథమిక దశలోనే నివారించేందుకు కృషి చేయాలని కోరారు. కోర్టు అనుమతి మేరకు జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఆదివారం కూడా నిమ్స్‌కు వచ్చి జగన్ వద్దే ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకే నిమ్స్‌కు చేరుకున్న ఆమె సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు