గొంతెమ్మ కోరిక కాదు.. నిరుద్యోగుల గోడు: వైఎస్‌ జగన్‌

6 May, 2017 19:51 IST|Sakshi
చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: నిరుద్యోగుల్లో అసంతృప్తి సమాజానికి మంచిది కాదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగులను పట్టించుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి శనివారం బహిరంగ లేఖ రాశారు. నిరుద్యోగుల గోడు వినేందుకు చంద్రబాబు తీరిక చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఇచ్చిన మాట మరిచిపోవడం వల్లే మరోసారి తాను ఈ లేఖ రాయాల్సి వచ్చిందంటూ గుర్తు చేశారు.

వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలతో రూ.2వేల నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాలని, అధికారంలోకి వచ్చి 35 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఫిబ్రవరిలో బహిరంగ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ చలనం లేని తీరుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్స్‌ పరీక్షలను మొక్కుబడిగా జరుపుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వం తరుపున ఎలాంటి భరోసా కనిపించడం లేదన్నారు.

ఏపీపీఎస్సీ అధికారులు కూడా నిరుద్యోగుల గోడు పట్టించుకోవడం లేదని, వారి అభిప్రాయం కూడా వినకపోవడం తననెంతో బాధించిందని, కనీసం వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని హితవు పలికారు. తీవ్ర నిరుద్యోగం, నిరుద్యోగుల్లో అసంతృప్తి సమాజానికి మంచిదికాదని హెచ్చరించారు. తాను రాస్తున్న లేఖలో గొంతెమ్మ కోర్కెలు లేవన్న వైఎస్‌ జగన్‌.. ప్రజలకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నానని చెప్పారు.

లేఖ పూర్తి సారాంశం...

మరిన్ని వార్తలు