నేనున్నానంటూ 'ఓదార్పు'

30 May, 2019 07:00 IST|Sakshi
విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన ఇమ్మానియేల్‌ కుటుంబాన్ని ఓదార్చుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(ఫైల్‌)

జిల్లాలో 1150 కిలో మీటర్ల పర్యటన

60 కుటుంబాలకు భరోసా

జగన్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం అభిమానుల హృదయాల్లో అలజడి రేపింది.. విషాదంలో నిండిపోయారు.. తట్టుకోలేని గుండెలు ఆగిపోయాయి.. మహానేత వారసుడిగా యువనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారిని ఓదార్చే బాధ్యత తీసుకున్నారు. రాష్ట్రంలో నలుమూలల చనిపోయిన అభిమానుల ఇంటికి వెళ్లి వెన్నుతట్టి నేనున్నానంటూ ఓదార్చారు.. కృష్ణాజిల్లాలో 60 మంది మృతి చెందగా వారి కుటుంబాలను కలుసుకుని భరోసా ఇచ్చారు. నాటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడి నేడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తుండడంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

సాక్షి, విజయవాడ: వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లాలో 2011 ఆగస్టు 16న ఓదార్పు యాత్ర ప్రారంభించారు. జిల్లాలోని సుమారు 1150 కిలోమీటర్లు పర్యటించి 26 మండలాల్లోని 60 కుటుంబాలను ఆయన వ్యక్తిగతంగా కలసి ఓదార్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.

అడుగడుగునా ప్రజాభిమానం..
కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రను జగ్గయ్యపేటలో ప్రారంభించి సెప్టెంబర్‌ ఒకటి నాటికి నూజివీడు చేరారు. సెప్టెంబర్‌ 2వ తేదీ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కావడంతో ఆయన ఇడుపులపాయ వెళ్లి అక్కడ వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించి, తిరిగి సెపెంబర్‌ 6న నూజివీడులో ప్రారంభించారు. మచిలీపట్నం, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో  ఓదార్పు యాత్రను ముగించారు. ఈ సందర్భంగా 60 కుటుంబాలను ఆయన వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓదార్పు యాత్ర అర్ధరాత్రి 2 గంటల వరకు సాగేది. నిర్ణీత సమయం కంటే ఐదారు గంటలు ఆలస్యంగా నడిచేది. అయితే అభిమానులు, కార్యకర్తల కోరికను  ఏనాడు జగన్‌ తిరస్కరించలేదు. ఎంతో ఓర్పుగా  ఓదార్పును నిర్వహించారు. అర్ధరాత్రి అయినా ఆయన కోసం అభిమానులు వేచి చూసేవారు.

జననేత సీఎం కావడంపై సంతోషం
గుణదల(విజయవాడ ఈస్ట్‌): విజయవాడ క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన మట్టా కోటేశ్వరరావు అలియాస్‌ ఇమ్మానియేలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. ఆయన మరణంతో తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు. దీంతో భార్య విజయ, పిల్లలు విజయ్, అజయ్‌ అనాథలయ్యారు. జననేత వైఎస్‌ జగన్‌  నిర్వహించిన ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడకు వచ్చి.. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా ఇచ్చారు. కన్నీరు దిగమింగిన ఆ కుంటుంబం జగనన్న రాకతో ఊరట చెందింది. తమకు భరోసా కల్పించిన జననేత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంపై ఆ కుంటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.

అమ్మా.. నేనూ నీ బిడ్డనే..!
నందిగామ:  నందిగామ నియోజకవర్గ పరిధిలో ముగ్గురు కన్నుమూశారు. వీరులపాడు మండలం, జుజ్జూరు గ్రామానికి చెందిన మంగలపూడి నాగభూషణం, అదే గ్రామానికి చెందిన పాపట్ల మరియమ్మ, కంచికచర్లకు చెందిన నాగరాజు మృతిచెందడతో 2011, ఆగస్టు 19న వచ్చిన మృతుల కుటుంబాలను సందర్శించిన జన నేత జగన్‌మోహన్‌ రెడ్డి మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. మహా నేత ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే తన లక్ష్యమని చెప్పి వారిలో ధైర్యం నింపారు. జన హృదయ నేత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనుండటంతో ప్రస్తుతం ఆయా కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఎటువంటి భేషజం లేకుండా కుటుంబ సభ్యుల్లో ఒకడిగా, తమకు అత్యంత ఆప్తుడిగా మెలిగిన తమ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని, ఆ క్షణాలు తమ జీవిత కాలం గుర్తుండిపోతాయంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెబుతున్నారు.

పుష్కరాలలో..
కృష్ణా పుష్కరాల సందర్భంగా 2016, ఆగస్టు 16వ తేదీన నందిగామ పట్టణంలోని ఓ కళాశాలలో చదువుతున్న నందిగామ, చందర్లపాడు, వీరులపాడు మండలాలకు చెందిన విద్యార్థులు పాశం గోపిరెడ్డి(19), కూచి లోకేష్‌(20), కమ్మవరపు హరిగోపి(20), ములకలపల్లి హరీష్‌(19), నందిగామ నగేష్‌ (20), కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. చందర్లపాడు మండలంలోని ఏటూరు, గుంటూరు జిల్లాలోని జిడుగు మధ్య కృష్ణా నదిలో పడి మృతిచెందారు. విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో అదే ఏడాది 18న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చారు. దాదాపు ఒక రోజుపాటు వారిని పరామర్శించేందుకు సమయం పట్టింది. వారిని ఆప్యాయంగా పలుకరించి, తాను తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు జగన్‌ ఓదార్చారు.  

మరిన్ని వార్తలు