90 శాతం హామీలు ఏడాదిలోనే అమలు

30 May, 2020 11:28 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనకు నేటితో ఏడాది

సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అభివృద్ధిని కాంక్షిస్తూ సాగుతోన్న పాలన

మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు ఏడాదిలోనే అమలు

రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాల సంక్షేమంపై సమదృష్టి

కర్నూలును ‘న్యాయ రాజధాని’గా చేస్తూ నిర్ణయం

ఏడాది పాలనపై సర్వత్రా ప్రశంసలు

‘ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌లా భావిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున ప్రజలందరికీ మాట ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు చేసి ‘శభాష్‌’ అనిపించుకున్నారు. కులం చూడం.. మతం చూడం.. వర్గం చూడం.. పార్టీలు చూడం.. అన్నట్లుగా పారదర్శక పాలన అందిస్తూ.. భావితరాల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో  సంక్షేమ రాజ్యంలో నవరత్నాల వెలుగులు విరజిమ్ముతున్నాయి.  ప్రగతి కొత్త పుంతలు తొక్కుతోంది. రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు,కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు జేజేలుపలుకుతున్నారు.  నేటితో రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

సాక్షి ప్రతినిధి, కర్నూలు : ‘మీ కష్టాలు నేను విన్నాను..నేనున్నానని’ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చెప్పినట్లుగా ప్రతి ఒక్కరి బాధ, ఆవేదన, కష్టాలు ఆయన గుండెల్లోనే ఉన్నాయని ఆయన ఏడాది పాలన, తీసుకున్న నిర్ణయాలు చూస్తే స్పష్టమవుతోంది. తొలి కేబినెట్‌లోనే  ఏకంగా 43 అంశాలపై తీర్మానం చేశారు. వాటి అమలు చకచకా కానిచ్చేశారు. ఈ హామీల అమలు వెనుకబడిన కర్నూలు లాంటి జిల్లాకు వరాలుగా మారాయి. ఓదార్పుయాత్ర, రైతుభరోసా యాత్ర, పాదయాత్రలో అడుగడుగునా జనం గోడు విన్నారు. వీటిని శాశ్వతంగా పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదులు, వందల సంఖ్యలో బోర్లు వేసినా నీరు పడక.. పంటలు పండక.. నష్టాల్లో కూరుకుపోయి, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కన్నీటి చెమ్మ జననేత
గుండెను తాకింది. అందుకే ‘రైతు భరోసా’తో అండగా నిలిచారు. ఉచితంగా వ్యవసాయబోర్లు వేసేందుకు నియోజకవర్గానికి ఓ రిగ్గు కొనుగోలు చేస్తున్నారు.  వడ్డీలేకుండా వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు.

పంటనష్టం వాటిల్లితే అండగా
ఉండేందుకు పంటలబీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చేశారు. పాదయాత్రలో అడుగడుగునా తమ బాధలను మొరపెట్టుకున్న పారిశుధ్యకార్మికులు, హోంగార్డులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సీనియారిటీని బట్టి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకునేలా తీర్మానం చేశారు. ఇల్లులేని వారికి ఇళ్లు, ఇంటి స్థలం లేనివారికి స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 90 శాతం హామీలు ఏడాదిలో అమలు చేశారు. ఇందులో ప్రతీ హామీ అమలులో రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ మేలు జరిగేది వెనుకబడిన మన జిల్లాకే అని, ఇది శుభపరిణామమని చెప్పవచ్చు.     

గ్రామ స్వరాజ్యం.. సాకారం
దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యం ద్వారానే పల్లెల అభివృద్ధి జరుగుతుంది, తద్వారా దేశాభివృద్ధి సాధ్యపడుతుందని మహాత్మాగాంధీ కలలుగన్నారు. కానీ స్వాతంత్య్రభారతంలో గ్రామస్వరాజ్య సాధన దిశగా తొలి అడుగు వేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. జగన్‌ సారథ్యంలోని ప్రభుత్వం పాలనను పల్లెలకు తీసుకెళ్లాలని ఏకంగా గ్రామసచివాలయ వ్యవస్థనే ఏర్పాటు చేసింది. జిల్లాలో 885 సచివాలయాలు నిర్మించారు. ఇందుకు 312.55 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో మౌలిక వసతుల కల్పనకు రూ.14 కోట్లు వెచ్చించారు. అలాగే జిల్లాలోని 9 మునిసిపాలిటీలలో 380 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. అందులో 3,040 మంది సచివాలయ ఉద్యోగస్తులు, 4,800 మంది వలంటీర్లు ఉన్నారు. గ్రామస్తులకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎటువంటి సర్టిఫికెట్‌ కావాలన్నా నిర్ణీత కాలపరిమితిలో అందేలా  రూపలకల్పన చేసింది. అలాగే వలంటీర్ల ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజా సంక్షేమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ సేవ చేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ఏడాదిలోనే మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా కరోనా సమయంలో వీరి సేవలు ప్రశంసనీయం.   

దిశ పోలీస్‌స్టేషన్‌తో మహిళల భద్రతకు భరోసా
బాలికలు, మహిళల భద్రత కోసం జిల్లాలో 79 దిశ పోలీస్‌స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో 158 మంది మహిళామిత్ర కోఆర్డినేటర్లు, 920 మంది సభ్యులు ఉన్నారు. మహిళల భద్రతకు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలపై ఒక బుక్‌లెట్‌ జారీ చేశారు. డయల్‌ 100 సేవలను మరింత బలోపేతం చేశారు. అలాగే స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్పీ కార్యాలయానికి వచ్చే స్పందన అర్జీల పరిష్కారంలో మొదటి స్థానంలో కర్నూలు జిల్లా ఉంది.  

ఉన్నత చదువులకు ఇంగ్లిషు మీడియం
కార్పొరేట్‌ పాఠశాలల దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు కుదేలయ్యాయి. దీంతో పిల్లల ఉన్నత చదువులు చదివి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవాలంటే ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి అని భావించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లి్లషు మీడియం ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ మీడియం చదివిస్తారనే అభిప్రాయం తీసుకుని విద్యాభోదన చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 97.67 శాతం మంది ఇంగ్లిషు మీడియంలో చదివేందుకు సిద్ధమయ్యారు.  

కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి, కార్పొరేట్‌ స్థాయిలో ఆధునికీకరించేందుకు నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. తొలివిడతలో రూ.322 కోట్లతో పాఠశాలలను ఆధునికీకరిస్తున్నారు. అలాగే జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందేలా పోషక విలువలతో కూడా ఆహారాన్ని మెనూలో చేర్చి, దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు.  విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు ఉచితంగా అందజేస్తున్నారు.  అలాగే జగనన్న విద్యాదీవెన ద్వారా జిల్లాలో 7,568 మందికి ఉపకార వేతనాలు చెల్లిస్తున్నారు.

రైతన్నకు దన్నుగా...
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడకుండా రైతు భరోసా పేరుతో వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఏడాదికి రూ.12,500 ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత 13,500 ఇచ్చేందుకు సిద్ధమైంది. 2019–20లో జిల్లాలో 3,70,308 మంది లబ్ధిదారులకు రూ.647.06 కోట్లు రైతుభరోసా ద్వారా ఇచ్చారు. 2020–21లో 4,90,382 మందికి ఇచ్చారు. అలాగే రైతు సమస్యలు తీర్చేందుకు జిల్లాలో 862 రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు