గ్యాస్‌ లీకేజీ ఘటన : హైపవర్‌ కమిటీ ఏర్పాటు

8 May, 2020 12:20 IST|Sakshi

కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్న నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌

నెల రోజుల్లోగా నివేదిక అందించాలని సూచన

సాక్షి, అమరావతి/విశాఖపట్నం : విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్‌ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన స్టైరిన్‌ విషవాయువును పీల్చడం ద్వారా 12 మంది మృతి చెందగా, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హైపవర్‌ కమిటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కరికలవలవన్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కె మీనా, పీసీబీ మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. (గ్యాస్‌ లీక్‌.. 12కు చేరిన మృతులు)

ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటానికి గల కారణాలపై ఈ కమిటీ సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుపూర్వోత్తరాలను ఆరా తీయనుంది. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా చేపట్టిన విస్తరణ కార్యకలాపాలు, దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కంపెనీ కార్యకలాపాల్లో అనుమతులు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు చోటు చేసుకుంటే దానికి గల కారణాలను ఈ కమిటీ అన్వేషించనుంది. విచారణలో ఎదురైన అంశాలు, ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం వెల్లడించిన అభిప్రాయాలతో కూడిన సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం హైపవర్‌ కమిటీకి సూచించింది.
(పరిశ్రమల శాఖను అప్రమత్తం చేసిన మంత్రి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా