‘పథకాల’ డోర్‌ డెలివరీకి సిద్ధం కండి

20 Jun, 2019 04:24 IST|Sakshi

పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

ప్రస్తుతం ఇస్తున్న నాసిరకం బియ్యానికి స్వస్తి

నాణ్యమైన మేలు రకం సన్న బియ్యం సేకరణ

5, 10, 15 కేజీలు బ్యాగుల్లో ప్యాకింగ్‌

ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచన

వలంటీర్ల నియామకానికి రంగం సిద్ధం

మార్గదర్శకాల రూపకల్పన.. సీఎం ఆమోదమే తరువాయి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సెప్టెంబర్‌ 1 నుంచి డోర్‌ డెలివరీ చేసేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లంచాలకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇస్తున్న నాసిరకం రేషన్‌ బియ్యానికి స్వస్తి పలకాలని, నాణ్యమైన మేలు రకం సన్న బియ్యాన్ని సేకరించాలని సీఎం ఆదేశించారు. 5, 10, 15 కేజీలు చొప్పున బ్యాగ్‌లో ప్యాక్‌ చేయించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అలాగే పూర్తి పారదర్శకంగా అర్హతల ఆధారంగానే వలంటీర్ల నియామకం జరగాలని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా అన్ని రకాల పథకాల డోర్‌ డెలివరీకి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటర్లీను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వీటికి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందగానే ఉత్తర్వులను జారీ చేయనున్నారు. మండల స్థాయి ఎంపిక కమిటీ ద్వారా నియామకాలు జరగనున్నాయి. కమిటీలో ఎంపీడీవో, తహసీల్దారు, ఈవో పీఆర్‌డీ ఉంటారు. ఈ కమిటీ దరఖాస్తు చేసుకున్న వారి ప్రతిభ ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తుంది. ఆ తర్వాత వారిని ఇంటర్వూ చేయనుంది. వలంటీర్లుగా నియమితులైన వారు ఎవ్వరైనా లబ్ధిదారుల నుంచి లంచాలు తీసుకున్నట్లు తేలితే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారని ఉన్నతాధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు