జోరువానలోనూ జననేత కోసం..

21 Sep, 2018 06:53 IST|Sakshi
పార్టీలో చేరిన కాపారపు శివన్నాయుడు, తదితరులు

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్రను గురువారం రద్దు చేశారు. బస చేసిన పప్పలపానివాలెం వద్ద అయితే బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. అయినా లెక్కచేయకుండా గురువారం ఉదయం పప్పలవానిపాలెంతో పాటు పరిసర కోలవానిపాలెం, ఎస్టీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున శిబిరం వద్దకు చేరుకున్నారు.

జగన్‌ను చూసేందుకు, ఆయన అడుగులో అడుగులేసేందుకు వర్షంలో తడుస్తూనే వేచి ఉన్నారు. ఎప్పటిలాగే గురువారం కూడా షెడ్యూల్‌ సమయానికి పాదయాత్ర ప్రారంభించేందుకు పార్టీ నేతలు కూడా ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర ప్రారంభించాలని జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఎదురు చూశారు. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్న భావనతో పార్టీ నేతలతో చర్చించి పాదయాత్ర రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అదే విషయాన్ని పార్టీ రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం ప్రకటించారు. మరోవైపు జననేతను చూడకుండా వెళ్లకూడదన్న పట్టుదలతో జోరువానలో తడుస్తూనే జనం శిబిరం వద్ద నిరీక్షించడంతో వారిని నిరుత్సాహపరచ కూడదన్న ఉద్దేశంతో వైఎస్‌జగన్‌ శిబిరం నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. దాంతో ఆయనకోసం నిరీక్షిస్తున్న వారందరూ కేరింతలు కొడుతూ జై జగన్‌.. అంటూ నినాదాలతో హోరెత్తించారు.

పలువురు పార్టీలో చేరిక
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు శిబిరం వద్ద వైఎస్‌జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయనగరం రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరుకు పార్లమెంటు సమన్వయకర్త పరీక్షిత్‌ రాజు, పార్వతీపురం సమన్వయకర్త అలజంగి జోగారావులు వెంటరాగా బీసీ నాయకులు కాపారపు శివన్నాయుడు, కాపారపు సత్యనారాయణ, స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు యండవ నిర్మలాకుమారి తమ అనుచరులతో జననేత సమక్షంలో పార్టీలో చేరారు.

మొహర్రం కారణంగా నేడు విరామం
ముస్లింల పండుగ మొహర్రం సందర్భంగా ప్రజాసంకల్ప యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించినట్టు తలశిల రఘురాం వెల్లడించారు. ఈ నెల 22(శనివారం) నుంచి యథావిధిగా పప్పలవానిపాలెం శివారులోని రాత్రి బస నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు