సాహో..‘సంకల్ప’ ధీర

6 Nov, 2018 13:14 IST|Sakshi

ఆయన పిలుపు.. భావితరాలకు మేలుకొలుపు

ఆయన ఆశయం.. నిలువెత్తు ఉన్నత శిఖరం

ఆయన గమనం.. పేదల సంక్షేమానికి రాజమార్గం

ఆయన గమ్యం.. ఐదు కోట్ల ఆంధ్రుల మోముపై చిరునవ్వులొలికించే సంతకంఅడుగడుగునా పేదల కష్టాలను ఆలకించి..    చలించిపోతున్న మానవత్వం. తాను నడిచిన బాటలో ప్రతి కన్నీటి బొట్టును తుడుస్తూ భరోసా కోట కడుతున్న గుండె ధైర్యం. అవినీతి, అక్రమాల పాలనను చీల్చి చెండాడుతున్న రేపటి వెలుగు కిరణం.. ఇదీ జన బాంధవుడు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది కాలపు ప్రజా సంకల్పయాత్ర ప్రస్థానం.. ఈ ఆత్మీయ యాత్ర పురుడు పోసుకుని నేటితో ఏడాది కాలం ముగిసిన సందర్భంగా కృష్ణా జిల్లా గుండెల్లో పదిలమైన పాదయాత్ర జ్ఞాపకం.. మరోసారి గుండె తలుపు తట్టింది.. జననేతపై జరిగిన హత్యాయత్నాన్ని తలుచుకుని ఆందోళనతో వణికిపోయింది.. తెలుగుదేశం పార్టీ కుట్రలను కాలం గర్భంలో కలిపేస్తామంటూ ప్రతిన బూనింది.   

సాక్షి, అమరావతిబ్యూరో : పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మమేకమై సమస్యలను గుర్తించడం.. ఆచరణయోగ్యమైన పరిష్కార మార్గాలను అధ్యయనం చేయడం.. అధికారంలోకి వస్తే ఆ సమస్యల పరిష్కారానికి అమలు చేయనున్న విధాన నిర్ణయాలను ప్రకటించడం.. తద్వారా దివంగత మహానేత వైఎస్సార్‌ సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం.. ఈ లక్ష్యాలతో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిçస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రోజురోజుకీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. అయితే గత నెల 25న విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే. జననేత నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్రకు నీరాజనాలు పట్టిన జనం.. ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. జననేతను ఎదుర్కొనలేకే అధికారపార్టీ నేతలు దొంగదెబ్బ తీయాలనుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఏడాది పూర్తయింది.

వారధి సాక్షిగా..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై జిల్లాలో జనాభిమానం వెల్లువెత్తింది. నెల రోజులపాటు ఆయన నిర్వహించిన పాదయాత్ర ఆసాంతం జనసందోహం మధ్య సందడిగా సాగింది. ‘సంకల్ప’ యాత్రికుడికి విజయవాడ ఆత్మీయ తివాచీతో స్వాగతం పలికింది. కనకదుర్గ వారధి వద్దే ఆయనకు అభిమాన జనసందోహం ఎదురేగి జిల్లాలోకి సాదరంగా తోడ్కొని వచ్చింది. జననేతను అనుసరిస్తూ వేలాదిమంది అభిమానులు వారధిపై కదం తొక్కారు. జననేత ఆసాంతం జనంతో మమేకమవుతూ పాదయాత్ర కొనసాగించారు. అందరి కష్టాలు వింటూ వారిని ఆదుకుంటానని ధైర్యంచెబుతూ ముందుకు సాగిపోయారు.

అధైర్యపడొద్దు.. నేనున్నా!
రెండు కాళ్లూ కోల్పోయినా పింఛన్‌రాని దుస్థితి.. గూడు కావాలి అంటే లంచం అడుగుతున్నారన్న పేద మహిళ గోడు.. పింఛను కోసం పడిగాపులు కాస్తున్నామన్న అవ్వాతాతల ఆవేదన.. కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నా అన్న ఆశా కార్యకర్తల బాధ.. ఇలా దారిపొడుగునా పేదలు, వృద్ధులు, మహిళలు, సామాన్యులు తమ కష్టాలను జననేత వద్ద చెప్పుకున్నారు. దాంతో చలించినపోయిన వై.ఎస్‌.జగన్‌ కళకళలాడాల్సిన పల్లెసీమలు ఇంతటి కష్టాలతో కునారిల్లుతున్నాయా అని ఆవేదన చెందారు. అందరికి ధైర్యం చెబుతూ.. ‘నేనున్నానని’ భరోసానిచ్చారు. ఆశా కార్యకర్తలు వై.ఎస్‌.జగన్‌ను కలుసుకుని తమ సమస్యలు వివరించారు. ఆశా కార్యకర్తలు వంటి చిరు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేసే విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. తనను కలిసిన కాంట్రాక్టు లెక్చరర్ల అసోషియేషన్‌ ప్రతినిధులకూ ఆదే హామీ నిచ్చి ధైర్యం చెప్పారు. అదే విధంగా చాలీచాలనీ జీతాలు ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామని వై.ఎస్‌.జగన్‌ ధైర్యం చెప్పారు. స్కాలర్‌షిప్‌ ఇవ్వడం లేదని, ల్యాప్‌టాప్‌లు ఇవ్వలేదని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు జననేతకు చెప్పుకున్నారు. మహానేత మహోన్నత ఆశయంలో నెలకొల్పిన ట్రిపుల్‌ ఐటీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే ట్రిపుల్‌ఐటీలను సంస్కరిస్తామని హమీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదలు అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు.

జిల్లాకు జననేత ఇచ్చినహామీల్లో కొన్ని..
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు..
నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ. 10 వేల సాయం
అంగన్‌వాడీలకు తెలంగాణలో ఇస్తున్న దానికంటే ఎక్కువ జీతం
దళిత వధువుకు వైఎస్సార్‌ పెళ్లి కానుకగా రూ.లక్ష
ఎస్సీ, ఎస్టీలతోపాటు రెల్లి తదితర కులస్తులకు ప్రత్యేకంగా మూడు ఫైనాన్స్‌ కార్పొరేషన్లు
90 శాతం సబ్సిడీతో పాడి పశువుల పంపిణీ
ప్రతి గ్రామంలో దళితులకు శ్మశానాలకు స్థలం కేటాయింపు
దేవాలయం, చర్చిల నిర్వహణకు ప్రతి పంచాయతీకి రూ. 10 వేల కేటాయింపు
పట్టణ పేదలకు ఇచ్చే ఫ్లాట్లపై ఉన్న రూ. 3 లక్షల రుణం మాఫీ
లాయర్లకు రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి
విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ, ప్రత్యేక కార్పొరేషన్‌
ప్రైవేట్‌ టీచర్, లెక్చరర్ల కోసం ప్రత్యేక చట్టం
ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మాణం
కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదింపు

మరిన్ని వార్తలు