జననేతకు ఘన స్వాగతం పలకండి

17 Nov, 2018 07:34 IST|Sakshi
సమావేశంలో చర్చిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు తమ్మినేని, కృష్ణదాస్‌ తదితరులు

ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగ సభ

ప్రజాసంకల్పయాత్ర సన్నాహక సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నేత తమ్మినేని

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెలాఖరులోగా జిల్లాలో ప్రవేశించే అవకాశమున్నందున పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, పిరియా సాయిరాజ్‌లతో ప్రజాసంకల్పయాత్ర సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలుపెరగని పోరాటం చేస్తున్న జగనన్నకు జిల్లాలో ఘన స్వాగతం పలికి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నుంచి జిల్లాలో పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు రోజులు చొప్పున దాదాపు 50 రోజుల పాటు పాదయాత్ర కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ వివరాలను నియోజకవర్గ సమన్వయకర్తలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. తిత్లీ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ బాధితులను కలుస్తారని చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు ఉంటాయని, స్థానిక సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, తమ్మినేని చిరంజీవినాగ్‌(నాని), దువ్వాడ శ్రీకాంత్, పాలే శ్రీనివాస్, మెట్ట కుమార్, ఉంగ సాయికృష్ణ, హరిప్రసాద్, ఆర్‌ఆర్‌ మూర్తి, పేడాడ అశోక్, టి.శ్రీరామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.  

18న వైఎస్సార్‌సీపీ  కార్యవర్గ సమావేశం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రజా సంకల్పయాత్రపై చర్చించేందుకు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు వైఎస్సార్‌ సీపీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. సమావేశానికి పార్టీ ముఖ్యులు వి.విజయసాయిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, తలశిల రఘురాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా కార్యవర్గం, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గం, రాష్ట్ర కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు హాజరుకావాలని కోరారు.

>
మరిన్ని వార్తలు