జజ్జనకర జనారే..విశాఖ భళారే 

23 Sep, 2018 04:47 IST|Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం పట్టిన విశాఖ జిల్లా 

పూల బాటలు పరిచి అడుగడుగునా ఘన స్వాగతం 

జనసంద్రాలైన బహిరంగ సభలు.. కిక్కిరిసిన రహదారులు 

జననేత భరోసాతో అందరిలోనూ భవిష్యత్‌పై చిగురించిన ఆశలు  

నాలుగున్నరేళ్ల బాబు పాలనను ఎక్కడికక్కడ తూర్పారబట్టిన వైనం  

ఇక మోసపోమంటూ బహిరంగ సభల్లో జనం ప్రతిస్పందన  

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు.. శ్రేణుల్లో నయా జోష్‌  

విశాఖలో నేడు ముగింపు.. రేపు విజయనగరం జిల్లాలో ప్రవేశం

సాక్షి ప్రతినిధి/సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పధీరుడికి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ బ్రహ్మరథం పట్టింది. నడిచొచ్చిన నిలువెత్తు నమ్మకాన్ని చూసి ఉప్పొంగిపోయింది. విశాఖ జిల్లాలోని పల్లెలు.. పట్టణాలు.. నగరం.. అన్న తేడా లేకుండా పరవశించిపోయాయి. ప్రజా ప్రతినిధులే కాదు.. క్షేత్ర స్థాయి అధికారులు సైతం కన్నెత్తి చూడని మారుమూల పల్లెలు, ఇరుకు దారుల్లోనూ రాజన్న ముద్దుబిడ్డ పాదయాత్ర సాగించడం ప్రజల మదిలో చెరగని ముద్ర వేసింది. నవ్యచరితను లిఖిస్తున్న ఆ అడుగులు కందకూడదని పొలిమేరల నుంచే అభిమాన జనం పూల బాట పరిచి ఘన స్వాగతం పలికారు.

దారిపొడవునా అదే అభిమానం కొనసాగింది. గుండె లోతుల్లో దాచుకున్న అభిమానాన్ని వర్షంలా కుమ్మరించారు. జననేత రాకతో ప్రతి పల్లె, పట్టణం పండుగ శోభ సంతరించుకున్నాయి. నాలుగున్నరేళ్ల నరకాసురపాలనలో నరకం చూస్తున్న తాడిత, పీడిత వర్గాల వారు తమ బాధను జననేతకు చెప్పుకున్నారు. జననేత ఇచ్చిన భరోసాతో ఊరట చెందారు. ఆయన అడుగులో అడుగులేస్తూ కనుచూపు మేర జనం కదం తొక్కారు. ప్రత్యేకించి విశాఖ నగరంలో విద్యార్థులు, యువత జననేతతో మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. 

ప్రతి అడుగూ ఓ ప్రభంజనం
ఆగస్టు 14న నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది మొదలు విజయనగరం జిల్లా పెందుర్తి మండలం చింతలపాలెం సమీపానికి చేరుకునే వరకు ప్రజా సంకల్ప యాత్ర ప్రభంజనంలా సాగింది. గన్నవరం మెట్ట నుంచి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా పాదయాత్ర సాగింది. గ్రామీణ జిల్లాలోని శారద, వరహా, సర్పా నదులతో పాటు పోలవరం, ఏలేరు కాలువలు, దుర్భేద్యమైన కొండలు.. గుట్టలు.. ప్రకృతి.. ప్రజానేతకు లభించిన ఆదరణకు సాక్ష్యంగా నిలిచాయి. ఇక మహా విశాఖలో అడుగు పెట్టింది మొదలు వేలాది అడుగులు అడుగులో అడుగు వేశాయి. 

మరిన్ని వార్తలు